స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్ట్ కు శతాబ్దాల చరిత్ర ఉందని అన్నారు. రూ.5,156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతూ.. మచిలీపట్నానికి బాబు తీవ్ర ద్రోహం చేశాడని అన్నారు. ఇక పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి..అడుగులు వేగంగా పడతాయి.. మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయని సీఎం వెల్లడించారు. గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేది.. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు.