స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మీడియాతో చిట్ చిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్‌లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హుద్ హుద్ ను సైతం తట్టుకున్న విశాఖ, నేడు అక్రమార్కులకు విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యక్తులను, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశాడని చంద్రబాబు అన్నారు.
అయితే ఇప్పటి వరకు జనం అన్నీ భరించారు… ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు… తిరుగుబాటు మొదలైంది అని స్పష్టం చేశారు. ఇక రానున్న రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలి ఉంది అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జంగ్ సోదరుడిలా రాష్ట్రంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలో జగన్ భయపెట్టి గెలుస్తున్నారని, కానీ కుప్పంలో ప్రజల అభిమానంతో తాను గెలుస్తున్నానని గర్వంగా చెప్పారు. పవన్ కల్యాణ్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే వైసీపీ నేతలు, మంత్రులు పనిగా పెట్టుకున్నారని మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.