30.2 C
Hyderabad
Thursday, January 23, 2025
spot_img

చలపతి మృతితో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ

తుపాకీ మోతలతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. పచ్చని అడవి ఎర్రబారుతోంది. ఎటు చూసినా… నెత్తుటి ఏరులే. వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. యాభై ఏళ్ల నుంచి సాగుతున్న ఆ యుద్ధకాండకు అంతమెప్పుడు? కేంద్రం చెబుతున్నట్లు 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలించడం సాధ్యమేనా? భద్రతాబలగాల వైపు నుంచి జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్టు ఉద్యమం ఎలాంటి వ్యూహ రచన చేస్తోంది? అసలు దండకారణ్యంలో ఏం జరుగుతోంది?

దేవుడు… దయ్యాలు… పదవులు… పగ్గాలు…. అంటూ బయటి ప్రపంచమంతా రోజువారీ రాజకీయాల్లో, ఈతి భాదల్లో మునిగి ఉంటే… అడవి మాత్రం తుటాల గాయాలతో నిత్యం నెత్తురోడుతోంది. అవును… మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో పచ్చని అడవి దుఃఖిస్తోంది. రాలుతున్న శవాలను లెక్కేసుకుంటూ యుద్ధాన్ని తిట్టుకుంటోంది. తాజాగా చత్తీస్‌ఘడ్‌ – ఒడిశా సరిహద్దు గరియాబాద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో పలువురు కీలక నేతలున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రతాప్‌ రెడ్డి అలియాస్‌ చలపతి కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. చలపతితో పాటు మావోయిస్టు కీలక నేతలు మనోజ్‌, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి అని చెబుతారు. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై కోటి రివార్డు ఉంది. చలపతి ప్రభుత్వ ఉద్యోగం వదిలి మవోయిస్టు ఉద్యమంలో చేరారు.

రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్‌ చలపతి 1988లో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్‌ ఫోర్‌మెన్‌గా పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీలో చేరి.. క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. ఎక్కువకాలం ఏవోబీలోనే పనిచేశాడు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఒడిశా రాష్ట్ర కమిటీకి మార్గనిర్దేశం చేస్తున్నాడు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన ఘటనకు చలపతి నేతృత్వం వహించాడు. బలిమెలలో భద్రత బలగాలపై దాడి ఘటనలోనూ చలపతి పాత్ర ఉందంటారు. 2003లో కొరాపూట్‌ జిల్లా పోలీసు కార్యాలయంపై దాడి చేసి ఆయుధాల్ని ఎత్తుకెళ్లిన ఘటనకు నాయకత్వం వహించాడని చెబుతారు. మావోయిస్టుల పార్టీ మిలటరీ కార్యకలాపాల్లో కీలకమైన చలపతి మృతితో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి.

అయితే… ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు భారీ విజయంగా ప్రకటించుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ఈ సందర్భంగా మరోసారి మావోయిస్టుల నిర్మూలనే తమ లక్ష్యమని ప్రకటించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని అన్నారు. నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగు పడిందని వ్యాఖ్యానించారు. తాజా ఎన్​కౌంటర్​ నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని, మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు. నిజానికి ఈ మాటను అమిత్‌ షా చాలా కాలంగా చెబతున్నారు. గత సెప్టెంబర్‌లో చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 మార్చ్ నాటికి దేశంలో మావోయిజాన్ని నిర్మూలిస్తామన్నారు. మావోయిజం సమూలంగా తుడిచిపెట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిందనే కారణంతో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. అందుకోసం ఎప్పటికప్పుడు తనదైన కొత్త వ్యూహరచనతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో భారీ సంఖ్యలో మధ్య భారతంలో భద్రతా బలగాలను మోహరించింది. కగార్ అంటే అంతిమ యుద్ధం అని అర్థం. నిజానికి ఆపరరేషన్‌ కగార్‌ కంటే ముందు కేంద్రం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ హాకా, ఆపరేషన్‌ ప్రహార్‌, ఆపరేషన్‌ సమాధాన్‌ అని ఇలా అనే యుద్ధ వ్యూహాలతో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో దండకారణ్యంపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధ ప్రక్రియ మొదలైన నాటి నుంచీ మధ్య భారతంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో విస్తరించి దండకారణ్య ప్రాంతంలో 2021 ఏప్రిల్‌ నుంచి డ్రోన్‌ దాడులు ప్రారంభమయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ఇండ్లపై, పొలాలపై డ్రోన్లతో వైమానిక దాడులు జరిగాయి. నిజానికి వైమానిక దాడులు… ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేసే సమయంలో కనిపిస్తుంటాయి. కానీ… ఇప్పుడు మధ్య భారతదేశంలో వైమానిక దాడులు సర్వసాధారణంగా మారాయి. మావోయిస్టుల లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో సాధారణ ఆదివాసీలు చనిపోతున్నారనే విమర్శలూ ఉన్నాయి. దీంతో… ఏ క్షణమైనా వైమానిక దాడి జరగవచ్చు అనే ఆందోళన ఆదివాసీ ప్రాంతాల్లో వుంది. భద్రతా బలగాలు అమలు చేస్తన్న యుద్ధ వ్యూహంలో భాగంగా… అటవీ ప్రాంతంలోని గ్రామాల్లోకి వచ్చిపోయేవారి పట్ల నిఘా పెంచడంతో పాటు… మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న దాడుల్లో ప్రతి నెలా పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. 2025లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. జనవరి 16న బీజాపుర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 18 మంది మరణించారు. 21వ తేదీ జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 18 మంది మృతి చెందారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అందుకోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాదిగా భద్రతా బలగాలను మోహరించింది. చత్తీస్‌గఢ్‌లో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక క్యాంపు ఏర్పాటు చేసి… అటవీ గ్రామాల్లో నక్సలైట్ల కదలికలపై నిఘా పెంచింది. మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా కట్టడి చేస్తోంది. ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరంగా చెప్పుకునే అబూజ్‌మడ్‌లాంటి కీకారణ్యంలోకి కూడా భద్రతాబలగాలు చొచ్చుకెళ్తున్నాయి. దండకారణ్యాన్ని జల్లెడపడుతూ… అన్నల ఏరివేత కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.

Latest Articles

దావోస్‌లో తెలంగాణ ధమాక.. రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్