స్వతంత్ర, వెబ్ డెస్క్: నేటి కాలంలో కూడా ఆడపిల్లలు పుడితే భారమనుకునే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో కూడా ఆడపిల్ల ఫుట్టిన మహిళల ఖాతాల్లో రూ.6 వేలు జమచేయనుంది. దేశంలో ఆడపిల్లల జనాభా పెంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమని ప్రకటించింది. 2022 ఏప్రిల్ నుంచే ఈ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. రెండో కాన్పులో కవలలకు పుట్టి అందులో ఆడపిల్ల ఉన్నా ఈ పథకం వర్తిస్తుందని వివరించింది.
ఇప్పటికే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల కోసం ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ పథకం అమల్లో ఉంది. ఈ స్కీం కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినా మూడు దశల్లో రూ.5 వేలు అందిస్తోంది. గర్భం వచ్చినట్లు ఆన్‌లైన్‌లో పేరు నమోదుచేసుకున్న తర్వాత రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2 వేలు, ప్రసవం జరిగి ఇమ్యూనైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2వేల చొప్పున అందజేస్తోంది.