ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రత్యేకత గురించి మాట్లాడుతూ జనగణన చేయాల్సిన అవసరాన్ని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో యూపీఏ సర్కార్ కొన్నేళ్ల కిందట జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకువచ్చిందన్నారు. అయితే జనగణన జరగకపోవడం వల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు కావడం లేదన్నారు ఆమె. దీని వల్ల ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటోందన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు పేద ప్రజలకు అందకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు సోనియా గాంధీ.
2013 సెప్టెంబరులో తీసుకువచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టం, 140 కోట్ల జనాభాకు పోషకాహార భద్రత కల్పించడంలో ఓ మైలురాయిగా నిలిచిందన్నారు సోనియా గాంధీ. ప్రధానంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ చట్టం లక్షలాది కుటుంబాల కడుపు నింపిందన్నారు సోనియా గాంధీ. ఆహార భద్రతను ప్రత్యేక హక్కుగా భావించరాదన్నారు ఆమె. ఆహార భద్రత…దేశ ప్రజల ప్రాథమిక హక్కు అనే విషయం కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జనాభా గణన విషయంలో ఎన్డీయే సర్కార్ అవలంబిస్తున్న వైఖరిని సోనియా గాంధీ విమర్శించారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా ఎన్డీయే పాలనలోనే జనాభా లెక్కలు తీసే ప్రక్రియ నాలుగేళ్లకు పైగా ఆలస్యమైందని కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు. జనగణన అసలు…2021లోనే జరగాల్సి ఉందన్నారు. అయితే ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని సోనియా గాంధీ విమర్శించారు. అంతేకాదు అసలు ఎప్పుడు జనాభా లెక్కలను తీస్తారన్న అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదన్నారు ఆమె. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా దాదాపుగా 81.35 కోట్ల మంది ప్రజలకు మేలు జరిగిందన్నారు సోనియా గాంధీ.