తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు శుభాభింనందనలు తెలియజేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి 33 మంది విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్బంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం ఆగస్టు 30, 31 తేదిల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రతి రీజియన్ లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.50 లక్షల నగదు బహుమతులను అందజేస్తున్నట్లు చెప్పారు.
ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు అనూహ్య స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారని చెప్పారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని విజేతలను సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. విజేతలలో గృహిణులు, ఉపాధ్యాయినీలు ఎక్కువగా ఉన్నారని, వారంతా 10 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ప్రయాణం చేస్తూ.. ఆర్టీసీ బస్సుతో అనుబంధం కలిగి ఉండటం హర్షణీయమన్నారు.
రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంత మొత్తం ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది రాఖీ పండుగకు ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందనకు దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకున్నామని, రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషితో పాటు అధికారుల పక్కా ప్రణాళిక వల్ల రికార్డు స్థాయిలో ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. సంస్థ తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, ఆర్టీసీ వెంటే తామున్నామని నిరూపిస్తున్నారని వివరించారు. పండుగల రోజుల్లో సిబ్బంది త్యాగం చేస్తూ సేవలు అందిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా స్పూర్తితో ఇక నుంచి ప్రతి దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానిస్తామని పేర్కొన్నారు. తమ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకూ ప్రతి నెల లక్కీ డ్రా నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.
గత రెండేళ్లలో టీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణికులే కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మరో 1000 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ కల్లా ప్రజలకు కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే 8 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా మహిళల కోసం మరో నాలుగు రూట్లలో (113 జెడ్/ఎం, 222ఏ, 9 ఎక్స్/272, 9 వై/ఎఫ్) లేడీస్ స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెరుగైన రవాణా సేవల్ని అందిస్తున్న సంస్థగా టీఎస్ఆర్టీసీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొంది ఉందని, అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సేవలు భేష్
లక్కీ డ్రాలో గెలుపొంది నగదు పురస్కారాలు అందుకున్న మహిళా ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఆర్టీసీ బస్సుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ దైనందిన జీవనంలో బస్సు భాగమైందని, బస్సుల్లోనే ప్రయాణిస్తూ ఉన్నతస్థానాలకు చేరుకున్నట్లు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న టీఎస్ఆర్టీసీ సేవల్ని ఎప్పటికీ మరచిపోలేమని కొనియాడారు. ప్రైవేట్ వాహనాలలో వెళ్లడం అంత సురక్షితం కాదంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం తమకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుందంటూ పలువురు విజేతలు స్పందించారు. అన్ని రీజియన్ల నుంచి తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా విచ్చేసిన విజేతలు నగదు పురస్కారాలను స్వీకరించి టి.ఎస్.ఆర్టీసీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ లక్కీ డ్రాలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్థిని కె. ప్రాంజల్ ద్వితీయ నగదు బహుమతి గెలుపొందడం విశేషం. తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు గుడిహత్నూరకు బస్సులో ప్రయాణించిన ఆ బాలిక.. లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకుంది. చిన్నతనంలోనే నగదు పురస్కారం అందుకోవడం పట్ల ఆ చిన్నారిని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నతస్థాయిలో ఉన్న వారు కూడా తమ జీవితంలో ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకున్నారని పేర్కొంటూ.. బాలిక ఆ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, సీటీఎం జీవన ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుస్రోషా ఖాన్, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.