ఆదిలాబాద్ లో పోటీ చేస్తున్న ప్రధాని పార్టీల అభ్యర్థులు నామినేషన్ల వేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే, పార్టీ అగ్ర నేతల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టి రిజర్వు స్థానం ఇక్కడి నుండి విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ,బిజెపి, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈనెల 18 నుంచి ప్రారంభమైన నామ పత్రాల స్వీకరణ ఈనెల 25 తో ముగియనుంది. మరో ఐదు రోజులే మిగిలి ఉండడంతో ఈనెల 22, 23 ,24 తేదీల్లో నామినేషన్లు వేయడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కానీ నామినేషన్ల ఘట్టంలో పాల్గొనే ప్రధాన పార్టీల రాష్ట్ర జాతీయ నేతలు ఎవరు రానున్నరనేది ఉత్కంఠ రేపుతుంది.
రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సుగణ.. అనేక ప్రజా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషిం చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఈ నెల 24న బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఇక, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ కు ఎవరు వస్తారు ఉన్నది ఉత్కంఠగా మారింది. ఈనెల 14న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి వెళ్లడంతో నామినేషన్ పర్వానికి అతిథులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు వచ్చి తమ నామినేషన్ పర్వంలో పాల్గొంటే ఓటర్లలో ఉత్సాహం పెరిగి తమ గెలుపు కు కారణమవుతుందని ఈ ముగ్గురు అభ్యర్థులు భావిస్తున్నారు.