ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ విధానంపై కాగ్ రూపొందించిన నివేదికను అధికార బీజేపీ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను బయటపెట్టింది. అధికార భారతీయ జనతా పార్టీతో జరిగిన వాగ్వాదంతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న అతిషితో సహా 15 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ నుండి మంగళవారం ఉదయం సస్పెండ్ చేశారు.
ఢిల్లీ మద్యం కేసుపై అసెంబ్లీలో కాగ్ నివేదికలోని ముఖ్య అంశాలు
మద్యం పాలసీ కారణంగా రూ. 2,002.68 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని కాగ్ స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనలు – 2010లో రూల్ 35ను అమలు చేయలేదని.. తద్వారా లైసెన్స్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని నివేదికలో వెల్లడించారు.
“ప్రభుత్వం హోల్‌సేల్ వ్యాపారుల మార్జిన్‌ను 5% నుంచి 12%కు పెంచింది. నిపుణుల కమిటీ సూచనలను పెడచెవిన పెట్టింది. పారదర్శకత లేదు. తనిఖీలు – పర్యవేక్షణ లేదు. లిక్కర్ సిండికేట్ల ఏర్పాటుకు దోహదం చేశారు. కొన్ని సంస్థలకు గుత్తాధిపత్యం కల్పించారు. మొత్తం 367 రిజిస్టరయిన బ్రాండ్లలో 25 బ్రాండ్లకే 70శాతం వాటా కల్పించారు. మద్యం వినియోగదారులకు పరిమిత బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. పోటీతత్వం లేకుండా చేయడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది. కేబినెట్ ఆమోదం లేకుండా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు”.. అని నివేదికలో వెల్లడించారు.
అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీయ సర్కార్ ఈ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో కొన్ని నెలలకే పాలసీని వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఈ మద్యం కుంభకోణంపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా జైలు కెళ్లారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.