ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి శనివారం లోక్‌సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిహార్‌కు వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం దక్కింది.
బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల కోసం ఈ బోర్డు పనిచేస్తుంది. మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ , మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రైతులు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డు చూస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అదే విధంగా బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50వేల హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే బిహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది.