బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ…ఈ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా చర్చ ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు.
ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన భట్టి.. గత ప్రభుత్వం మాత్రం వనరులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. దీంతో… ప్రస్తుతం రోజు వారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే.. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామన్న ఆయన… ఆ దిశగా ఈ శ్వేతపత్రం విడుదల చేయడమన్నది తొలి అడుగుగా అభివర్ణించారు.
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. కనీసం నివేదికను చదివే సమయం ఇవ్వలేదన్న ఆయన.. ముందురోజైనా ఈ పుస్తకం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు.
శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం లెక్కలు ఓసారి గమనిస్తే.. తెలంగాణ రాష్ట్ర అప్పులు 6 లక్షల 71 వేయి 757 కోట్లుగా ప్రకటించారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం కేవంల 72 వేల 658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం మూడు లక్షాల 89 వేల 673 కోట్లు. ఇక, బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉండడం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణభారం పది రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతభత్యాలకే 35 శాతం వ్యయమవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకూ పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ.
ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్‌రావు… ఇదంతా తప్పలతడక అంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి తప్ప మరోటి ఇందులో లేదంటూ విమర్శించారు. సాధారణంగా అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని చెప్పుకొచ్చిన ఆయన.. నివేదికలో ఆ అంశాలను చూపించలేదన్నారు. గత తొమ్మిదేళ్లలో మూడున్నల లక్షల కోట్ల మేర మూలధన వ్యయం జరిగిందని… దాన్ని శ్వేతపత్రంలో చూపించలేదని ఆరోపించారు హరీష్‌రావు.
హరీష్‌రావు విమర్శలు, ఆరోపణలకు గట్టి కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరాన్ని 80 వేల కోట్లతో కట్టామని బీఆర్ఎస్ చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97 వేల కోట్లకు పైగా మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తీసుకొచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందన్నారు ముఖ్యమంత్రి. బ్యాంకులను మభ్యపెట్టి, తప్పుడు నివేదికలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రానున్న రోజుల్లో మరిన్ని శ్వేతపత్రాలు విడుదల కానుండడంతో సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది.


