మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది బీఆర్‌ఎస్ పరిస్థితి. అసలే అధికారం పోయి అయోమ యంలో ఉన్న అధిష్టానానికి గులాబీ నేతలు షాక్‌ల మీద షాక్‌లిస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్‌కు ముగ్ధులవుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతోంది. కళకళ లాడే గులాబీ వనం వాడిపోతోంది.
తెలంగాణలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రసవ త్తరంగా రక్తి కట్టిస్తున్నాయి. అధికారం తారుమారయ్యేసరికి బీఆర్‌ఎస్ నేతలంతా పార్టీకి పంగనామం పెట్టి పక్కపా ర్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే కేకే, కడియం, దానం నాగేందర్ వంటి నేతలంతా అధిక సంఖ్యలో కాంగ్రెస్‌కు క్యూకట్టగా.. అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తంతో చేయి కలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతోపాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి హాజరైన తెల్లం వెంక ట్రావు.. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత అధికారికంగా రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెతో జతకట్టడంతో గులాబీ శిబిరం ఖాళీ అయింది. ఇక తెల్లం ఫిరాయింపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుండి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు 5,719 ఓట్ల మెజా రిటీతో గెలుపొం దారు. ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొంతకాలంగా బిఆర్ఎస్‌తో అంటీము ట్టనట్టుగా వ్యహహరిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన ఛలో మేడిగడ్డ, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ కైవసం చేసుకునే సరికి ప్లేట్ ఫిరాయించారు తెల్లం వెంకట్రావ్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉంటూ వారికి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు పొంగులేటితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే,.. భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోదెం వీరయ్య ఉండటంతో తనకు సీటు రాదని భావించిన తెల్లం బీఆర్‌ఎస్ గూటికి చేరారు. అంతకు ముందు 2014 లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బిఆర్ఎస్‌లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి వీయర్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై గెలిచి తన చిరకాల కోరికను నేరవేర్చుకు న్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి గులాబీ పార్టీకి కలిసి రావడం లేదు. అక్కడ 2014లో కొత్త గూడెం నుంచి జలగం వెంకట్రావు 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఆ పార్టీ తరపున గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావ్ ఒక్కరే గెలిచారు. ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. అయితే జిల్లాలో బిఆర్ఎస్ బలోపేతం కోసం వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకుని మంత్రిగా అవకాశం ఇచ్చారు. పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా తనవైపుకి తిప్పుకున్నారు. అయితే,.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు నిరాశ తప్పలేదు. ఒక్క ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది గులాబీ పార్టీ. అయితే,.. తీరా 2023 ఎన్నికల సమయం వచ్చే సరికి బీఆర్‌ఎస్‌తో విబేధాల కారణంగా పొంగులేటి, తుమ్మల ఇద్దరూ గులాబీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో పాటుగా రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకుని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే,.. ఈ ఎన్నిక ల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా,.. ఆ ఎమ్మెల్యే సైతం హస్తంతో జత కట్టడంతో బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టుపడుతోంది బీఆర్‌ఎస్. ఇప్పటికే దానం, కడియంలపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలు.. ఇప్పుడు పార్టీ వీడిన తెల్లం వెంకట్రావ్ పై కూడా అనర్హత వేటుకు సిద్ధమ వుతోంది. మరి బీఆర్‌ఎస్ డిమాండ్‌ను స్పీకర్ లెక్కలోకి తీసుకుంటారా ..? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండను న్నాయన్నది ఆసక్తి రేపుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ అవ డంతో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్ఠతకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.