తెలంగాణలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఓవైపు ప్రచార హోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా ప్రధాన పార్టీలతోపాటు ఇతర పార్టీలు కూడా ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు.. వివిధ పేర్లతో సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొన్ని చెబుతుంటే, మరికొన్ని కాంగ్రెస్ వైపే ప్రజల మద్దతు ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. అయితే.. మెజార్టీ సర్వేలు ఈసారి హస్తం పార్టీదే హవా అని అంటుండడం అధికార బీఆర్‌ఎస్‌లో గుబులు రేపినట్లే కన్పిస్తోంది.
ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా జరుగుతున్న ఓ ప్రచారం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. ఈనెల 20న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారని ఓ టాక్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి రాజకీయ వ్యూహకర్త గురురాజ్ అంజన్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు గంటలపాటు ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగాయంటూ ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు వస్తున్న సర్వేలకు తోడు నిఘా వర్గాలు ఇస్తున్న నివేదికల్లోనూ అధికార పార్టీకి ఎదురుగాలి తప్పదన్న వార్తల నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందన్న వాదన విన్పిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ సమాజంలో మారుతున్న కుల, మత సమీకరణాలను దృష్టిలో ఉంచుకొనే వీరి మధ్య చర్చలు జరిగి ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న మైనారిటీలు ఈసారి కాంగ్రెస్‌కు జైకొడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వెల్లడైన ముస్లిం విద్యావంతుల వేదిక కూడా ఈ విషయాన్నే చెబుతోంది. బీఆర్‌ఎస్‌కు వ్యక్తిగతంగా వీళ్లంతా వ్యతిరేకం కాకపోయినా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. పైగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేశాం కదా అని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతుండడం ఇందుకు నిదర్శనం.
ఇక, గత ఎన్నికల్లో గులాబీ పార్టీకి జైకొట్టిన ముదిరాజ్ సామాజిక వర్గం కూడా ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు దూరం జరుగుతున్నట్లే కన్పిస్తోంది. ఒక్కసీటు కూడా ఇవ్వకుండా తమను అవమానించారన్న అభిప్రాయం వారిలో ఉండడంతో ఆ కుల సంఘాలన్నీ ఒకే మాటకు కట్టుబడి తమ వారందరికీ మెసేజ్‌లు సైతం పంపుతున్నాయన్న వార్తలు విన్పిస్తున్నాయి. పైగా తెలంగాణ బీసీల్లో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గంలో ముదిరాజ్‌లు ముఖ్యమైన వాళ్లన్నది అన్ని పార్టీలకూ తెలిసిన విషయమే. వీరికితోడు తెలంగాణలోని ఎస్సీల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న మాదిగ సామాజిక వర్గం బీజేపీకి జైకొట్టేసింది.
ఇలా పలు కీలక అంశాలపై కేసీఆర్, పీకే మధ్య మూడు గంటలపాటు చర్చలు జరిగాయని వార్తలు రావడంతో ఇతర పార్టీలు సైతం అప్రమత్తమయ్యాయి. అయితే.. గతంలో తాము పీకేను ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇది జరిగిన కొంతకాలానికే మళ్లీ పీకేకు ప్రగతి భవన్ ద్వారాలు తెరవడం బీఆర్‌ఎస్‌ను గట్టెక్కించడానేకేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.