తెలంగాణలోని రైతులు, రైతు సంఘాలను చేరువ చేసేందుకు బీఆర్‌ఎస్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటింనుంది. జనవరి 24 నుంచి ఒక నెలపాటు రాష్ట్రంలో పర్యటించేందుకు మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుంది.
నెల రోజులపాటు అన్ని జిల్లాల్లోని అన్నివర్గాల రైతులను కలిసి… అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రుణమాఫీ ఎంత మేరకు జరిగింది? కరెంటు సరఫరా, సాగు పరిస్థితులెలా ఉన్నాయి? మద్దతు ధరలు దొరుకుతున్నాయా? బోనస్ ఏమైంది? కొనుగోలు కేంద్రాలున్నాయా? రైతు వేదికలు పని చేస్తున్నాయా? తదితర అంశాలపై అధ్యయనం చేసి, నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది.
మరోవైపు నిన్న మంచిరేవులలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్‌గాంధీ నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ ఎన్నో హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుభరోసా, మద్దతు ధర, బోనస్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేదని కేటీఆర్ అన్నారు.