భారత్ రాష్ట్ర సమితి సాదా సీదా రాజకీయ పార్టీ కాదు. మౌలికంగా అదొక ఉద్యమ పార్టీ. తెలంగాణ మలిదశ ఉద్య మానికి నాయకత్వం వహించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన పార్టీ. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేసీఆర్ చాలా కాలం పాటు తెలంగాణ రాజకీయాలకే పరిమితమయ్యారు. దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వంతో అప్పటి కేసీఆర్ సర్కార్‌కు లడాయి మొదలైంది. ధాన్యం కొనుగోలు అంశం కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మధ్య అగ్గి రాజేసింది. దీంతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, కేసీఆర్ క్యాబినెట్ సహచరుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కేసీఆర్‌కు కలిగింది అంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్.
మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పరాజయం పాలైంది. దీంతో రాజకీయంగా గులాబీ పార్టీ వెనక్కి తగ్గింది. ఓటమి నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్ త్వరలో ఖాళీ అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు డీలా పడ్డారు. పైకి మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నా బీఆర్‌ఎస్ పెద్దల్లో కూడా నిస్తేజం అలుముకుంది. పులి మీద పుట్రలా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో చిక్కుల్లో పడింది. కేసీఆర్ కుటుంబాన్ని కేసులు వెంటాడటం మొదలైంది. అధికారంలో ఉండగా హవా చెలాయించిన కేసీఆర్ కుటుంబసభ్యులు ఎప్పుడు…ఏ కేసు మెడకు చుట్టుకుంటుందో నని ఆందోళన పడుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ఆమెను ఇటీవల తీహార్ జైలుకు తరలించారు. కవిత అరెస్టు, భారత్ రాష్ట్ర సమితిలో ప్రకంపనలు సృష్టించింది. మద్యం కుంభకోణంలో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఒకదశలో కథ అరెస్టు వరకు వెళ్లింది. అయితే కవితను అరెస్టు చేయకుండానే ఈడీ అధికారులు వెనుదిరిగారు.దీంతో కవిత అరెస్టు జరగదన్న అభిప్రాయానికి వచ్చారు బీఆర్‌ఎస్ నాయకులు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్‌గిరి రోడ్ షోలో పాల్గొంటున్న సమయంలోనే ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికే కాదు…బీఆర్‌ఎస్ పార్టీకి కూడా ఇది ఊహించని షాక్. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టయ్యారు. భూముల ఆక్రమణ, బెదిరింపుల ఆరోపణలకు సంబంధించి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కన్నారావుతో పాటు మరో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ మరో బంధువు జోగినపల్లి సంతోష్ రావుపై కూడా కేసు నమోదైంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి పోలీసు అధికారులకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆధారాలు లభించాయి. దీంతో ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది.
కేసీఆర్ కుటుంబంలోని ఒకరిద్దరి మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకునే అవకాశాలున్నాయన్నది రాజకీయ వర్గాల సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకరరావు అమెరికా నుంచి వచ్చి నోరు విప్పితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది…ఎవరి బుర్రకు పుట్టిన ఆలోచన ? ఎవరి సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ? ఎవరి ఫోన్‌ను ఎందుకు ట్యాపింగ్ చేయవలసి వచ్చింది ? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభాకరరావు సమాధానాలు చెబుతారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ఎన్నికల సమయంలో డబ్బులు ఎవరెవరి చేతులు మారాయో అనే విషయం కూడా వెల్లడయ్యే అవకాం ఉంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ది పనులపై కూడా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగా దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ కుంగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వరంలా మారింది. మేడిగడ్డ వివాదం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. ఎన్నికలు ముగిసిన తరువాత కాళేశ్వరం అంశం రూపంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఆయుధం దొరికినట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై రిటైర్ జడ్జితో విచారణ చేయిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్.అలాగే విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలపై, అవుటర్ రింగ్ రోడ్డు టోల్ లీజుపై కూడా ఆరా తీస్తున్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా విచారణ సాగు తోంది.


