తెలంగాణకు గర్వకారణమైన రాడార్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేవీ రాడార్ స్టేషన్‌కు సహకరించాల్సింది పోయి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారని విమర్శించారు. దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా అని నిలదీశారు. రక్షణ శాఖకు సంబంధించిన షిప్స్‌ను కమ్యూనికేట్ చేసే రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణకు ఎంతో పేరు వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు జిల్లా అటవీ శాఖ నుంచి కేంద్ర పర్యావరణ శాఖ వరకూ అన్ని అనుమతులు పొందిందని చెప్పారు.


