బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు వదిలేది లేదంటోంది గులాబీ పార్టీ. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే వలసలు ఆగుతాయని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపులను ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్ కు ధర్మాసనం జతచేసింది. ఈనెల 10న పాత పిటిషన్‌తో కలిపి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టులో ఇంతకుముందే పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఇప్పటికే పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్.ఎల్.పి. దాఖలు చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద గౌడ్.
మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. దీంతో పదిమంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారం శ్రీనివాస్, సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు
1.తెల్లం వెంకట్రావు…భద్రాచలం
2.కడియం శ్రీహరి… స్టేషన్ ఘన్ పూర్
3.దానం నాగేందర్… ఖైరతాబాద్
4.ప్రకాష్ గౌడ్…రాజేంద్రనగర్
5.అరికేపూడి గాంధీ…శేరిలింగంపల్లి
6.గూడెం మహిపాల్ రెడ్డి…పటాన్ చెరు
7.కాలే యాదయ్య…చేవెళ్ల
8.పోచారం శ్రీనివాస్ రెడ్డి…బాన్సువాడ
9.బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…గద్వాల
10.సంజయ్ కుమార్…జగిత్యాల