Murder | ఓ ప్రేమికుడి అన్న చేసిన పనికి నిండు ప్రాణం బలయ్యింది. తల్లిందండ్రులు మందలించడంతో ఓ యువతి తాను ప్రేమించిన వాడి చెంతకు వెళ్ళింది. తన బిడ్డ చేసిన తప్పు ఎలాగైనా సరిదిద్దాలని.. తన కూతురిని తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నంలో ప్రేయసి మేనమామ దారుణంగా బలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… విజయవాడకు చెందిన నవీన్ అనే యువకుడు, ఒంగోలుకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా వీరి ప్రేమ మారడంతో.. ప్రేమించిన వాడి చెంతనే ఉండాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి.. విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్ళింది. ఇది తెలుసుకున్న అమ్మాయి తల్లిందండ్రులు ఎలాగైనా నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలని.. మేనమామ శ్రీనివాస్‌ను వెంటబెట్టుకుని నిన్న (బుధవారం) నవీన్ ఇంటికి వెళ్లారు.
నవీన్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆ అమ్మాయిని మేనమామ ఇంటికి తీసుకెళ్లారు. ప్రేమించిన వాన్ని ఒక్క క్షణం కూడా ఉండలేని ఆ అమ్మాయి.. తిరిగి నవీన్ ఇంటికి వెళ్ళింది. దీంతో మేనమామ, తల్లిదండ్రులు నవీన్ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. మా అమ్మాయి ఎక్కడ ఉంది చెప్పు అంటూ.. గట్టిగా మాట్లాడటంతో.. మీరే తీసుకెళ్ళారుగా.. మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నారేంటి? నాకేం తెలుసు అంటూ నవీన్ గొడవకు దిగాడు. అమ్మాయి వైపు బంధువులు కూడా కోపంతో ఊగిపోవడంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. చివరికి నవీన్ అన్న… కత్తితో ఆ అమ్మాయి మేనమామ శ్రీనివాస్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో శ్రీనివాస్ మృతి చెందాడు.