టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల ఆలోచనలు మారుతున్నాయి. అందివచ్చిన అవకాశాలను అందుకుని కాలానుగుణంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ కొన్ని గ్రామాల్లో ఇంకా పాతకాలంలోనే ఉండిపోయారు. మన సమాజం ఎంత ఆధునికంగా ఎదిగినా గ్రామాల్లో ఇంకా కులం కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో దహెగాం మండలం ఇట్యాలలో ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు పదేళ్ల క్రితం ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారి పది కుటుంబాలను కులసంఘ బహిష్కరణకు గురిచేసింది. ఇట్యాలలో ఇద్దరు యువకుల మధ్య ఎప్పుడో పదేళ్ల క్రితం గొడవ జరిగింది. పంచాయితీ పెట్టిన కులపెద్దలు గొడవ పడిన ఇద్దరి యువకులలో ఒకరి కుటుంబంతో పాటు అతని బంధువుల కుటుంబాన్ని కూడా వెలివేశారు. ఇలా పదేళ్ల కాలంలో వెలివేతకు గురైన కుటుంబాల సంఖ్య పదికి చేరింది.
మొత్తం 23 బెస్త కుటుంబాలు ఉన్న ఈ ఇట్యాలలో వెలికి గురైన కుటుంబాల్లో జరిగే చావులు, పెళ్లిళ్లు ఇతర ఏ కార్యక్రమాలకూ ఇతరులు ఎవరు వెళ్లకూడదు. బహిష్కరణకు గురైన వారిలో రాటి వెంకటి తండ్రి గణపతి చనిపోతే కులపెద్దలు ఎవరూ వెళ్లలేదు. బామినే మల్లయ్య కూతురు రెండేళ్ల క్రితం చనిపోయినప్పుడు కూడా ఎవరూ వెళ్లలేదు. పదేళ్లలో వెలికి గురైన కుటుంబాల్లో జరిగే చావులు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు కులపెద్దలు రావటం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. వెలివేతకు గురైన తమ పది కుటుంబాలను మళ్లీ తమ కులంలో కలిపేలా కుల పెద్దలతో మాట్లాడి, తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్‌లో వారంతా మొరపెట్టుకున్నారు.