తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. నిర్మల్, కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తాపడటంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్ సెక్షన్ వద్ద ముస్కాన్ ట్రావెల్ బస్సు కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బస్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ట్రావెల్స్ బస్సు కోడుమూరు సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులు చిక్కుకోవడంతో ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం కొంతమందిని కోడు మూరు ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ, గోవర్ధిని బాలికలుగా గుర్తించారు.


