జార్జ్ సోరోస్, సోనియా మధ్య ఆర్థిక సంబంధాలున్నాయన్న సంచలన ఆరోపణలను గట్టిగా వినిపిస్తోంది బీజేపీ. ఇప్పటికే పలువురు కమలనాథులు ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకుని సోనియాపై నిప్పులు చెరిగారు. అయితే,.. తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా స్పందించారు. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్, సోనియా గాంధీ మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆయన.. ఈ ఆరోపణలు తీవ్రమైనవని అన్నారు. రాజకీయ దృక్పథంతో చూడరాదని.. దీనిని రాజకీయంగా తిప్పికొట్టడం ఇష్టం లేదని తెలిపారు. భారత వ్యతిరేక శక్తులపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ పౌండేషన్ నుంచి ఆర్థిక సాయం పొందే ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది బీజేపీ. జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర దేశం చేయాలనే భావజాలంతో FDL-AP పౌండేషన్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ నిప్పులు చెరిగింది. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు సోనియా గాంధీ నేతృత్వం వహించడం జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి దారితీసిందని తెలిపింది.
అయితే,.. బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలు తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అగ్రరాజ్యంపై ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. ఇలాంటి ప్రవర్తన భారత్‌కు ఇబ్బందికరంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం, దౌత్యం అంటే భాజపాకి అర్థం కాదని, చిల్లర రాజకీయాలకు ఆ పార్టీ పాల్పడుతోందని అన్నారు.