ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో పవిత్ర తిరుమలకు అవినీతి మకిలీ అంటుకుందని అన్నారు. భక్తుల సౌకర్యాలు మృగ్యమయ్యాయి, అన్యమతాల ఉనికితో సనాతన ధర్మానికి విఘాతం వాటిల్లిందని చెప్పారు. గత కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవినీతి అరోపణలు వచ్చాయన్నారు.
అర్హతలను బట్టి కాకుండా సొంత మనుషులతో TTDని నింపారని ఆరోపించారు. TTDని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలని కోరారు. శ్రీవాణి ట్రస్టుకు పది వేల విరాళం ఇస్తే సామాన్య భక్తులకు కూడా వీఐపీ దర్శనం కల్పించేవారని,భక్తుల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకలు, విరాళాలు, హుండీ ఆదాయంపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని లేఖలో లక్ష్మణ్ కోరారు.