తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ సీఎం కేసీఆర్(CM KCR) దగ్గర ఉందని ఆరోపించారు. ఫోన్ డేటా చూసి కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని.. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనకు కాల్స్ చేయడం చూసి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 5న టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేసే క్రమంలో బీజీపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్ పోయిందని సంజయ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు వరంగల్ సీపీ రంగనాథ్ పై కూడా సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఆయనపై పరువునష్టం దావా వేస్తున్నానని తెలిపారు. రంగనాథ్(Ranganath)ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విజయవాడ సత్యంబాబు కేసులో ఆయన ఏం చేశారో తనకు తెలుసన్నారు. అలాగే నల్లగొండ, ఖమ్మంలో ఎన్ని ఆస్తులు పోగేశారనే వివరాలు కూడా తన దగ్గర ఉన్నాయని.. వీటన్నింటిపై విచారణ చేపడతామని రంగనాథ్ కు బండి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.