స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తనకు భద్రతను రెట్టింపు చేయాలని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీని కోరారు. అయితే డీజీపీ అఫీసులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. తనకు భద్రతను రెట్టింపు చేయాలని గత ఏడాది ఏప్రిల్ నెలలో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నానని.. ఇంతవరకు భద్రత కల్పించలేదని తెలిపారు. ఇప్పటివరకు భద్రత గురించి ఏం చర్యలు తీసుకున్నారని అడిగితే పోలీసు అధికారులు మౌనంగానే ఉండిపోయారన్నారు.
కొంతకాలంగా ప్రభుత్వానికి సంబంధించిన కేసులలో ఇస్తున్న ఆధారాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల ఆరోపణల నేపథ్యంలో తనకు సెక్యూరిటీని పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే 2014 నుంచి పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినట్లు రఘునందన్ వెల్లడించారు.