సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
రేపు అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భువనగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించను న్న బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రే అమిత్ షా హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు ఇవాళ రాత్రే హైదరాబాద్ చేరుకోనున్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. రేపు ఉదయం 9 గంటలకు వరంగల్‌లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు.