బర్డ్ ఫ్లూ.. ఇప్పుడు ఈ పేరు మాంసాహారప్రియులను కలవరపెడుతోంది. చికెన్ లేనిదే ముద్ద దిగని వారు ఇప్పుడు తినాలా వద్దా.. అని తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారాల్లో బర్డ్ ఫ్లూ సోకిందని తేల్చడమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ కావడంతో నాన్‌వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
గోదావరి జిల్లాల్లో రెండు చోట్ల బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. కానూరు, తణుకు పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల వైరస్ ప్రభావం లేదని స్పష్టం చేశారు.
బర్డ్ ఫ్లూ తేలిన రెండు కోళ్ల ఫారాలలోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూడ్చి పెట్టిన ఒక్కో కోడికి 90 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోళ్ల ఫారాల చుట్టూ కిలోమీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సమీప చికెన్ దుకాణాలు మూసివేయాలని హెచ్చరించారు. 10 కిలోమీటర్ల పరిధిలో నిఘా పెట్టాలని అధికారులు సూచించారు.
వలస పక్షుల ద్వారా సంక్రమణ
బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే ఈ వైరస్.. వాటి రెట్టల ద్వార జలాశయాల్లోకి చేరుతోంది. ఆ నీటి నుంచి ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం కనిపిస్తోంది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా.. బయటపడేయడంతో కోళ్ల ఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఈ వైరస్ జీవించలేదు. ప్రస్తుతం ఏపీలో అధిక ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతుందని నిపుణులు అంటున్నారు.
ఉడికించిన మాంసం, గుడ్లు తీసుకోవచ్చు
ఉడికించిన మాంసం, గుడ్లు తీసుకుంటే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో ఈ వైరస్ బతికి ఉండదు. కోడి గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం.. కాబట్టి అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెబుతున్నారు.