2024 పార్లమెంటు ఎన్నికలు బీహార్ లో ప్రధానిమోదీ, నితిశ్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల మారిన సమీకరణల నేపథ్యంలో జేడీయూ చీఫ్ నితిశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బీహార్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఉత్సాహంలో బీజేపీ, జేడీయూ ఉన్నాయి. మరో పక్క ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహా ఘఠ్ బంధన్ గా ఎన్డీఏకి గట్టి పోటీ సవాల్ విసురుతున్నాయి. నితిశ్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు చేరడంతో బీహార్ లో బలమైన ముస్లీం కమ్యునిటీ మహాగఠ్ బంధన్ కు అండగా నిలిచే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలు నితిశ్ కు అగ్నిపరీక్షే. మారుతున్న బీహార్ రాజకీయ చిత్రం పై ఓ లుక్.
కులాల సంకుల సమరానికి ప్రతీకగా నిలిచే బీహార్ లో 2024 పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి నల్లేరు బండిపై నడడ కాదు. 2019 లో 40 స్థానాల్లో 39 స్థానాలను గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిన చాలా పార్లమెంటు నియోజక వర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ క్లీన్ స్వీప్ చేయడం జేడీయూ- బీజేపీ కూటమికి గట్టి హెచ్చరికే. కొన్ని దశాబ్దాలుగా లోకల్ పార్టీలదే ఆధిపత్యం.1990వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్ యాదవ్ ఎన్నికైన తర్వాత .. యాదవులతో పాటు, దళితులు, వెనుక బడిన వర్గాలన్నింటినీ ఏకం చేయడంలో విజయం సాధించారు. ఆ తర్వాత బీహార్ రాజకీయాలపై నితిశ్ కుమార్ జేడీయూ, లాలూ ప్రసాద్ ఆర్జేడీ ఆధిపత్యమే సాగింది. బీజేపీ కానీ, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితిలేకుండా పోయింది.
బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలు. ఈ రాష్ట్రంలో ఈ సారి పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ మొత్తం ఏడు దశల్లోనూ జరుగుతాయి. బీహార్ , ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనే ఏడు దశల్లోనూ 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ఔరంగాబాద్, గయ, నవాడ, జమూయి స్థానాలకు, ఏప్రిల్ 26న కిషన్ గంజ్, పుర్నియా, కటిహార్, భాగల్పూర్, బంకా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 7న మూడో దశలో ఝంజ ర్పూర్, సుపౌల్, అరారియా, మాధేపురా, ఖగారియా స్థానాలకు, నాల్గోదశలో మే 13న దర్భంగా, ఉజియార్ పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మే 20న ఐదో దశలో సీతామర్హి, మధుబని, ముజఫర్ పూర్, సరన్, హాజీపూర్ నియోజకవర్గాల్లో ఓట్ల పండుగ ఉంటుంది. మే 25న ఆరోదశలో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, పూర్వి చంపారన్, షియోహర్, వైశాలి, గోపాల్ గంజ్, సివాన్, మహారాజ్ గంజ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1 చివరి దశ లో నలంద, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారాం, కరకత్, జహానాబాద్ నియోజకవర్గాల ఎన్నికతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన్ శక్తి పార్టీ ఐదు స్థానాలు, జితన్ రామ్ మాఝీ పార్టీ , ఉపేంద్ర కుష్వాహ పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఇక మహా గఠ్ బంధన్ లో ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం చెరో స్థానంలోనూ సీపీఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఇంకా అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీఎస్పీ, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ వంచి చిన్న పార్టీలు ఎన్నికల గోదాలో ఉన్నాయి.
ఒకప్పుడు ఇండియా కూటమి పేరుతో దాదాపు 25 ప్రతిపక్షాలను ఏకంచేసి.. జాతీయ స్థాయి నాయకుడిగా, కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రతిష్ట సాధించిన నితిశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఆయన ప్రభ తగ్గింది. తరచు అటు ఆర్జేడీ, ఇటు బీజేపీలో చేరి రంగు మార్చుకోవడంతో పాటు ఒక పార్టీలో ఉండగా మరో పార్టీని చీల్చిచెండాడి మళ్లీ అదే పార్టీలో చేరుతూ వచ్చిన నితిశ్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. పేదల ఛాంపియన్ గా భావించిన నితిశ్ తాజాగా కాషాయం కండువా కప్పుకోవడంతో జనం,ముఖ్యంగా ముస్లింలు దూర మయ్యారు. ఇక బీహార్ రాజకీయాల్లో బీజేపీ నితిశ్ ను తోసిరాజని ఆధిపత్యం సాగిస్తోంది. సీట్ల సర్దుబాటులో బీజేపీ పైచేయి స్పష్టంగా కన్పించింది. పాపం నితిశ్ కుమార్ అన్పించింది. చిరాగ్ పార్టీ ఐదు సీట్లను అమ్ముకున్నాడని ఆరోపిస్తూ ఆపార్టీకి చెందిన మాజీ మంత్రితో సహా 22 మంది రాజీనామా చేయడం కొసమెరుపు. జైలుకు వెళ్లినా, ఆరోగ్యం దెబ్బతిన్నా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభ తగ్గలేదు. ప్రస్తుతం మహా గఠ్ బంధన్ మరింత బలపడింది. ఎన్డీయే కూటమికి పెద్దషాక్ ఇచ్చేటట్లే కన్పిస్తోంది. నితిశ్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఆర్జేడీకి కలిసివచ్చే అంశమైంది.గతంలో కేవలం వెయ్యి, రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో ఆర్జేడీ పట్టు పెరిగింది. ఫలితాలు ఎలా ఉంటాయో. జూన్ 4న తెలుస్తుంది.


