స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నియంతృత్వ పాలనకు స్వస్తిపలికేందుకు ప్రజల్లో ఐక్యత తీసుకుని రావాలని క్యాడర్‌కు సూచించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మీడియాతో ముఖాముఖి వెళ్లవద్దని సూచించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 30 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 15 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు.
కలిసికట్టుగా రావాలి..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు రెండో రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలంతా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపారు. పదేళ్ల బీజేపీ నిరంకుశ పాలనలో ప్రజల సమస్యలు రెట్టింపయ్యాయని ప్రధాని పేదలు, రైతులు, మహిళలు, యువత, కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే మానేశారని అన్నారు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని.. ప్రేక్షక పాత్ర వహించకుండా ఐక్యతతో నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.
మీడియాతో జాగ్రత్త..
అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలని వీలయితే మీడియాకు దూరంగా ఉండాలని లేదంటే పొరపాటుగా చేసిన చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చెయ్యాలని కోరారు. ఐక్యత క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.