విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. పృథ్వీ కామెంట్స్‌కి హర్ట్ అయిన వైసీపీ నేతలు బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అది చూసి దెబ్బకు విశ్వక్ సేన్‌కు వణుకు పుట్టింది. విడుదలకు ముందే సినిమాను కిల్ చేసేలా ఉన్నారే అని కంగారు పడ్డాడు. అతనితో మాకు ఏ సంబంధం లేదు.. అసలు ఆ సీన్ కూడా సినిమాలో లేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో మాకు తెలీదు అని క్షమాపణలు చెప్పారు.
తాజాగా ఈ వివాదం పై నటుడు నిర్మాత బండ్లగణేష్ స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలతో సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి.. విశ్వక్‌సేన్‌కు ఆల్ ది బెస్ట్’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మరీ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.. అది గుర్తు పెట్టుకో అని కామెంట్లు చేస్తున్నారు.
అసలు ఏం జరిగింది..?
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని.. సినిమా చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయి.. అదేమిటో అంటూ వైసీపీపై సెటైర్లు వేశాడు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనలా రూపాంతరం చెందింది అంటూ ప్రసంగం చేసి సినిమా ఈవెంట్ ని కాస్తా.. పొలిటికల్ ఈవెంట్ కింద మార్చేశారు. ఇక ఇది విన్న వైసీపీకి ఎక్కడో కాలింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అంటూ ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక లైలా సినిమా నిర్మాత సాహు, హీరో విశ్వక్సేన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఇద్దరూ రంగంలోకి దిగి .. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ కామెంట్స్ కి సినిమాకి సంబంధం లేదని చెప్పడం మొదలుపెట్టారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే సినిమా ఎలా బతకాలి.. అని విశ్వక్సేన్ మొరపెట్టుకుంటున్నాడు. చాలా కష్టపడి సినిమా తీశాం.. ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నానని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ప్రమేయం లేకుండా జరిగిన దానికి సినిమాని బలి చేయొద్దని వేడుకున్నాడు. తమకు ప్రమేయం లేకున్నా సారీ చెబుతున్నానని అన్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్వామని అన్నాడు.
కానీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం సినీ నటుడు పృథ్వీకి చుక్కలు చూపిస్తున్నారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ వైసీపీని కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుపుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్‌లో 1.25 లక్షల ట్వీట్లు వేశారు. పృథ్వీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.
సినిమా ఫంక్షన్లు, పొలిటికల్ ఈవెంట్ లను వేర్వేరుగా చూడాలి. రెండు రంగాల్లో ఉన్నవాళ్లు సందర్భానుసారంగా మాట్లాడాలి. అంతేకానీ ఎంటర్ టైన్ మెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేస్తే వాళ్లదేం పోయిద్ది.. పోయేదంతా నిర్మాతదే కదా. ఇక ఈ వివాదం పృథ్వీ క్షమాపణ చెబితేనే ఆగేలా ఉంది. లేదంటే ప్రేక్షకులైనా ఇవేమీ పట్టించుకోకుండా సినిమాను ఆదరించాలి.