కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో నిశ్శబ్ద వాతావరణంలో మూగవేదన అనుభవిస్తోంది. పాలకుల పట్టించుకోనితనమో, అధికారుల అలసత్వమో..కారణం ఏదైనా ఈ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణాలు కొలిక్కి రాలేకోతున్నాయి.
యావత్ రాయలసీమలోనే బనగానపల్లె పది పడకల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. 1982లో ఈ ఆసుపత్రి భవనాలు నిర్మించారు. ఎంతో కాలం ఆసుపత్రి ప్రజాదరణకు నోచుకుంది. 1982లో ఈ పది పడకల ఆయుర్వేద వైద్య సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ప్రారంభం కాగా, ఇక్కడి వైద్యం కోసం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చేవారు. ఇక్కడ పంచకర్మ ధెరపీ కి ఎంతో పేరు ఉంది. దీంతో, వివిధ ప్రాంతాల నుంచి ప్రతి నిత్యం దాదాపు 100 మంది రోగులు ఇక్కడకు వచ్చేవారు.
కాలంతో వచ్చిన మార్పుల వల్ల ఎందరికో సేవలు అందించిన ఆసుపత్రికే అస్వస్థత వచ్చేసింది. కూలిన భవనాలు, కూలడానికి సిద్దంగా ఉన్న భవనాలను చూసి రోగులు భయపడి తమ రాక తగ్గించేశారు. తగ్గిన పేషెంట్లు, సిబ్బంది కొరత కారణంగా 2012 లో పంచకర్మ థెరపీని నిలిపివేశారు. ఆసుపత్రికి ఎంతో పేరుతెచ్చిన పంచకర్మ థెరఫీయే నిలిచిపోవడంతో.. ఇక ఆసుపత్రి మొహం చూడడానికి ఎవరు ఇష్టపడడం లేదు. 2013 నుంచి పది పడకలు సైతం మూలపడ్డాయి. పది పడకల ఆసుపత్రిగా పెద్ద పేరు తెచ్చుకున్న ఈ ఆయుర్వేద ఆసుపత్రి ఇప్పుడు ఓపీ సేవలకు మాత్రమే పరిమితం అయ్యింది. పది బెడ్లు, పంచకర్మ, స్టీమ్ బాత్, ఆయిల్ మసాజ్, శిరోధార తదితర వైద్య చికిత్సలన్నింటినీ కోల్పోయి ఆసుపత్రి నిస్తేజంగా మారింది.
గత వైసీపీ సర్కారు హయాంలో సుమారు 56 లక్షల రూపాయలతో ఆసుపత్రి భవన పునర్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, బిల్లులు చెల్లించలేదని కాంట్రక్టర్ పనులు నిలిపివేశాడు. అన్ని సవ్యంగా ఉంటే.. కొత్త భవనాల్లో కొంగ్రొత్త రీతిలో ఆసుపత్రి కళకళలాడేది. పూర్తికాని కొత్త భవనం అలంకార ప్రాయంగా మారగా, పాత శిథిల భవనంలో రోగులు పూర్తిస్థాయి వైద్యసేవలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బి.సి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణాల పరిస్థితి ఈ రీతిన తయారవ్వడం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 22 న తొలిసారి 56 లక్షల 25 వేల విలువతో అధికారులు టెండర్లు పిలిచారు. అయితే, ఒకే ఒక కాంట్రాక్టర్ పాల్గొనడం, సింగిల్ షెడ్యూల్ దాఖలు కావడంతో ఉన్నతాధికారులు ఆ టెండర్ ను రద్దు చేశారు. అనంతరం ఏడు సార్లు టెండర్లు పిలిచారు. దీంతో, కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. బిల్లుల్లో జాప్యం పరిస్థితులు చూసిన మరి కొందరు కాంట్రాక్టర్లు వెనుకంజ వేసినట్టు తెలిసింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జోక్యంతో 56 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చాలావరకు పూర్తయ్యాయి.
గదుల కిటికిటీలకు అద్దాల అమర్చే పనులు మాత్రమే మిగిలాయి. బిల్లులు పెండింగ్ లో ఉన్నందు వల్ల కాంట్రాక్టర్ నిర్లిప్త వైఖరి అవలంభించాడు. కేవలం రెండు లక్షల రూపాయల నిధులు ఇస్తే చాలు.. కిటికిటీలకు అద్దాలు అమర్చే పని పూర్తయిపోతుంది. అప్పుడు కొత్త భవనం అందుబాటులోకి వస్తుంది. అయితే, ఇప్పుడు దీన్ని పట్టించుకునేవారు ఎవరూ ఉండడం లేదు.
బనగానపల్లిలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో గతంలో వైద్యానికి అవసరమైన మొక్కలు పెంచేవారు. ఔషధి మొక్కల ఆసుపత్రిగా మంచి పేరు పొందడమే కాకుండా 15 మందికి పైగా వైద్య సిబ్బందితో ఆసుపత్రి కళకళలాడుతూ ఉండేది. భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, కొత్త భవనాల నిర్మాణం కొలిక్కి రాకపోవడం, సిబ్బంది పదవీ విరమణ, కొత్త సిబ్బంది నియామకం జరగకపోవడం… ఈ కారణాల వల్ల ఆసుపత్రిలో వివిధ రకాల సేవలు అంతరించే పోయే పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జనార్దన రెడ్డి.. ఈ విశిష్ట ఆసుపత్రిపై దృష్టి సారించి…ఓపి సేవలకే పరిమితం కాకుండా.. పది పడకల ఆసుపత్రిగా పూర్వవైభవం తీసుకురావాలని జిల్లావాసులు కోరుతున్నారు.