నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమ గట్టు దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ కోసం 15వ రోజు రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. జాతీయ 11 రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గత 14 రోజుల నుండి కృషి చేస్తున్నప్పటికీ..ప్రమాదంలో మృతి చెందినట్లుగా భావిస్తున్న ఆ ఎనిమిది మందిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతునే ఉన్నాయి. ఇప్పటివరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్లు ముందుకు వెళ్లాలంటే ఆటంకం కలుగుతుంది. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సంబంధిత రెస్క్యూ బృందాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..కేరళకు చెందిన క్యాడ్ వర్ డాగ్స్‌తో ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద స్థలం సమీపంలో 13.50 మీటర్ల అవతల వైపు ఒకే చోట ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా నిర్ధారించాయని మంత్రి వెల్లడించారు. సొరంగంలో సిపిఎస్ వేగంగానే వస్తుందని కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మత్తులు జరగడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో శనివారం 525 మంది రెస్క్యూ బృందాలు నిమగ్నమై ఉన్నారని, రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ రావడంతో.. సొరంగంలో వస్తున్న దుర్వాసనను బట్టి ముగ్గురు వ్యక్తులు ఒకే ప్రదేశంలో ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చామన్నారు. అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు.
మిగిలిన 50 మీటర్ల సొరంగంలోకి సహాయక చర్యలు జరగాలంటే కాస్త ఆచితూచి రెస్క్యూ బృందాలు అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందన్నారు. దీని కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయ చర్యలను పరివేక్షించారు. త్వరలోనే క్షతగాత్రులను బయటికి తీసుకు వస్తామని, దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్క్యూ బృందాలను ఇక్కడికి తీసుకొచ్చి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతుందన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా టన్నెల్ మార్గం లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించామన్నారు. మంత్రితో పాటు కలెక్టర్ బాధావత్, సంతోష్ ఎస్పీ రఘునాథ్ , ఇతర రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.