స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ప్రత్యేకమైంది. గత కొన్ని రోజులుగా రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీ దాదాపు అన్ని పార్టీలు ఖమ్మంపై ఫోకస్ పెట్టాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన తర్వాత కూడా ఇంకా ఖమ్మంలో రాజకీయం సెగలు కక్కుతూనే ఉన్నది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwara rao) కేంద్రంగా జరుగుతున్నది.
పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. పుంజుకుంటున్న కాంగ్రెస్ వెంటనే ఆయనను పార్టీలోకి తీసుకువచ్చే పనిలో పడింది. వరుసగా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి మంత్రిగా పని చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడినంత మాత్రానా పెద్దగా నష్టమేమీ ఉండదని తుమ్మలను పరోక్షంగా పేర్కొంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. తమ బలం సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తాము రాష్ట్రంలో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధి ఆధారంగా ఎన్నికల్లోకి వెళ్లుతామని చెప్పారు. అభివృద్ధి మంత్రంతోనే ఎన్నికలకు వెళ్లుతామని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నుంచి ఒకే సీటు గెలుచుకుందని పువ్వాడ అన్నారు. ఈ సారి ఖమ్మం జిల్లా నుంచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా పని చేస్తామని వివరించారు. తుమ్మల, పొంగులేటిలు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.