స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పు చోటు చేసుకుంది. అనూహ్యంగా మోదీ సర్కారు కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజును తప్పించి.. ఎర్త్ సైన్స్ శాఖ బాధ్యతలు అప్పగించింది. కొత్త న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికార ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన రిజిజు మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో క్రీడల మంత్రిగానూ సేవలు అందించారు. 2021 జులై 8నుంచి ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
అయితే ఉన్నట్లుండి న్యాయమంత్రిగా కిరణ్ రిజిజును తప్పించడంపై విపక్షాలతో పాటు అధికార నేతలు షాక్ అయ్యారు. కొన్ని నెలలుగా సుప్రీంకోర్టుకు, కేంద్రానికి మధ్య కొలిజీయం అంశంలో అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కొలిజీయంపై రిజిజు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు కొందరు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి.
కిరణ్ రిజిజును న్యాయమంత్రిగా తప్పించడంపై శివసేన పార్టీ వ్యంగ్యంగా విమర్శలు చేసింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇబ్బందికరంగా రావడంతోనా? మోదానీ-సెబీ దర్యాప్తు కారణమా? అంటూ ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.