- బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును తప్పుబట్టిన లక్ష్మీనారాయణ
- కోర్ కమిటి లో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని ఆరోపణ
- జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్‌లోకి ఏపీ నేతలు
- ఏపీలో పవన్.. తెలంగాణలో బండి సంజయ్‌ను వీక్ చేసే కుట్ర
- పవన్‌కు అండగా ఉంటాం-కన్నా
- ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే కుట్ర
- అందుకే కొత్త జీవో తెచ్చారన్న కన్నా
ఏపీ బీజేపీలో ముసలం మొదలైంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య వివాదం తారస్థాయికి చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కొందరు నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఏపీ బీజేపీకి కీలకనేతలు, కార్యకర్తలు పార్టీ వీడడానికి కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజుల మధ్య విభేదాలు ఉండటమే కారణమని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీలో కల్లోలం ఏర్పడింది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తాయి. సోమువీర్రాజు నియామకం అయిన దగ్గరనుంచి వీరిద్దరి మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ కాస్తా బ్లాస్ట్ అయ్యింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. బీజేపీ నేతలంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో సమాధానం చెప్పాలని, సోమువీర్రాజుని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఏపీ బీజేపీపై కుట్ర జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు.