స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో ఒంటిపూట బడులను జూన్ 24 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ చేయాలని సూచించింది. ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో మరో వారం రోజులపాటు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.