స్వతంత్ర వెబ్ డెస్క్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజయ్య.. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరి నిమిషంలో అయినా అధిష్టానం తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే… టికెట్ రేసులో జానకిపురం గ్రామ సర్పంచ్ నవ్య చేరారు. తనకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్ రేసులో నేను సైతం అంటున్నారు సర్పంచ్ నవ్య. ఇటీవల సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యే రాజయ్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. పోటీ కోసం ఒక్కఛాన్స్ ఇవ్వండని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన తర్వాత ఇప్పుడు టికెట్ రేసులో కడియం శ్రీహరితో పోటీ పడుతున్నారు సర్పంచ్ నవ్య.
ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుండి ఒక్కసారి కూడా మహిళా ఎమ్మెల్యే ఎన్నిక అవ్వలేదని చెబుతున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 1న) హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను నవ్య దంపతులు కలవనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలు ఏమీ అవసరం లేదంటున్నారు సర్పంచ్ నవ్య.
నవ్య డిమాండ్ చేస్తున్నట్లుగానే బీఆర్ఎస్ అధిష్టానం ఆమెకు టికెట్ ఇస్తుందా..? లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఖరారు అయ్యింది. చివరి నిమిషంలో అయినా తనకు బీఫామ్ దక్కుతుందనే నమ్మకంతో నవ్య ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర పార్టీలు టికెట్ ఇస్తాయా..? అనే చర్చలు కొనసాగుతున్నాయి.