DC vs RR Match| ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓటముల బాధ తప్పడం లేదు. రిషబ్ పంత్ లేని లోటు ఆ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. పంత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన డేవిడ్ వార్నర్ జట్టును గెలుపుబాటలో పట్టించడంలో విఫలమవుతున్నాడు. మొదటి రెండు మ్యాచులు ఓడిపోయిన ఢిల్లీ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులోనూ ఓడిపోయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు అద్భుతంగా ఆడి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్ సేన ఆది నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. కెప్టెన్ వార్నర్ 65, లలిత్ యాదవ్ 38 పరుగులతో రాణించినా మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. చివరకు 20ఓవర్లలో 9వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హ్యాట్రిక్ ఓటములు తన ఖాతాలో వేసుకుంది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో 3వికెట్లు తీసుకున్నారు. ఈ గెలుపుతో శాంసన్ సేన టోర్నీలో తొలి విజయం దక్కించుకుంది.