స్వతంత్ర వెబ్ డెస్క్: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను నియమించింది. ఓ రకంగా ఎన్నికల ప్రకటన రాకముందే.. AICC ఈ కమిటీలను ప్రకటించడంతో ద్వారా ఇక ఎన్నికల బరిలో దిగాలంటూ కేడర్‌కి ఇన్‌డైరెక్ట్‌గా పిలుపునిచ్చినట్టేనని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే.. కాంగ్రెస్ పార్టీ కసరత్తులను పూర్తిచేసింది.
ఎన్నికల రోడ్ మ్యాప్.. హామీలు, టికెట్లు ఇలా ప్రతీ అంశంపై పూర్తిగా ఫోకస్ పెట్టి.. సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కాలంలో అసెంబ్లీ టికెట్లకు సంబంధించి రకరకాల వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చిన అధిష్టానం.. సర్వేల ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే AICC స్ర్కీనింగ్ కమిటీలను ప్రకటించి.. కొత్త సందేశాన్నిచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, టికెట్ల పంపిణీలో స్క్రీనింగ్ కమిటీ పాత్ర కీలకంకానుంది.
తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కే. మురళీధరన్ నియమించింది. ఇక సభ్యులుగా బాబా సిద్దిఖ్, జిగ్నేశ్ మేవానీ నియమించారు. దాంతోపాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే , ఏఐసీసీ ఇంఛార్జి సెక్రటరీలను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కొత్త సందేశం పంపింది. స్క్రీనింగ్ కమిటీల్లో ఏ రాష్ట్రంలోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు లేరు.
తెలంగాణను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉత్తమ్‌కు చోటు కల్పించారు. ఉత్తమ్ పార్టీ వీడి వెళ్తారంటూ జరిగిన ప్రచారాన్ని పట్టించుకోని అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ మెంబర్‌గా చేర్చింది. దీంతోపాటు టికెట్ల విషయంపై ఎవ్వరూ మాట్లాడవద్దంటూ కూడా హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో చెప్పిన దాని ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని.. ప్రజల్లో ఉండాలంటూ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం..
అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ప్రకటించింది హైకమాండ్. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీ ఉండగా.. పార్టీలోని పలువురు సీనియర్ నేతలకు చోటు కల్పించింది. 2024లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తిగా రూట్ మార్చిన కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే కమిటీలు, ఇంచార్జ్‌లకు బాధ్యత అప్పగిస్తోంది.