ఏపీలో అన్నా క్యాంటీన్లు కళకళలాడనున్నాయి. అధికార పగ్గాలు చేపట్టగానే తన మార్క్ చూపించుకునే పంథాలో పడ్డ సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇటు రాష్ట్ర ప్రజల మనసు దోచుకుంటూనే, జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పథకాలను మళ్లీ అమలులోకి తీసుకువస్తున్నారు.
ఒడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్నట్టు ఉంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమంతోనే జగన్‌ను టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీని చిత్తుగా ఓడించి పాలన పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత ఆగిపోయిన పథకాలను అమలు చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతగా 100 క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది. ఆగస్ట్ 15 స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు చేతుల మీదుగా క్యాంటీన్ ప్రారంభంకానుండగా.. మిగిలిన 99 క్యాంటీన్లను శుక్రవారం నాడు పలు జిల్లాల్లో నియోజకవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు.
ఇక, అన్నాక్యాంటీన్లలో ప్రతీ రోజు ప్రజలకు వడ్డించే మెనూ, ధరలను కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం టిఫిన్, మధ్నాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా రూ 5 కే అందించాలని నిర్ణయించింది. ఇక, మెనూ ప్రకారం ప్రతీ సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ లేదా పూరీ ఉంటుంది. లంచ్‌గా వైట్ రైస్ కూర, పప్పు లేదా సాంబార్, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతీ రోజు లంచ్, డిన్నర్‌లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది. పదార్ఢాలు మాత్రం మారనున్నాయి. మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్‌లో ఇడ్లీ కామన్‌గా ఉంటుంది. రెండో టిఫిన్‌గా పూరీ, పొంగల్, ఉప్మా అందుబాటులో ఉంటాయి. ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు అందిస్తారు. రాత్రి డిన్నర్ రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఆదివారం సెలవుగా ప్రకటించగా.. వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు. ఇక క్యాంటీన్ల నిర్వహణకోసం ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే వారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది సర్కార్.
ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. ఈ సంస్థకు రాష్ట్రంలో 12 భోజనశాలలున్నాయి. ఒక్క మంగళగిరిలోని భోజనశాలలోనే నిత్యం లక్ష మందికి భోజనం తయారు చేయగల సామర్థ్యమున్న వంటశాల ఉంది. దీని నిర్వహణ చాలా బాగుందని మంత్రి వివరించారు మంత్రి నారాయణ. 2019కు ముందు రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్ల ద్వారా 4.60 కోట్ల మంది పేదల కడుపు నింపామని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ పాలనలో క్యాంటీన్లను మూసివేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ఆగస్టు 15 నుంచి వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తామని ఆ సంస్థ తెలిపింది హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ. మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 5 వరకు గడువు కోరినందున వాటిని సెప్టెంబరు 5న ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. మొత్తానికి మళ్లీ అధికారంలోకి రావడడంతో ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టుకోనున్నారు సీఎం చంద్రబాబు.