AP Skill Development Scam |ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో CID వేగం పెంచింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న జీవీఎస్ భాస్కర్‌ను సీఐడి అధికారులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా వెళ్లిన ఏపీ సీఐడీ టీమ్ అక్కడ భాస్కర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలోనే ఇతన్ని పట్టుకున్నా.. రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మరిన్ని ఆధారాలు సేకరించాక CID మళ్లీ అరెస్టు చేసింది. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. సీమెన్స్ సంస్థ ఉద్యోగి అయిన జీవీఎస్ భాస్కర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. యూపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అపర్ణ భర్త భాస్కర్ కేంద్రంగానే స్కామ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీలో డిప్యూటేషన్‌పై పనిచేశారు అపర్ణ. స్కిల్‌డెవలప్‌మెంట్ విభాగంలో ఆ టైమ్‌లోనే కుంభకోణం జరిగింది. ఇందులో అపర్ణ భర్త పాత్ర కీలకమని భావిస్తోంది సీఐడీ.
గతంలో భాస్కర్‌ను అరెస్టు చేసినప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగి కాదనే కారణంతో కొన్ని సెక్షన్ల కింద ఆయన్ను రిమాండ్‌కి ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాక అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ వెంటనే సీఐడీ టీమ్ యాక్షన్ మొదలుపెట్టింది. GST, ఇంటెలిజెన్స్, IT, ED ఏజెన్సీలన్నీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill Development Scam) దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఇందులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు అని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. కొద్ది రోజులుగా వరుసగా అరెస్టులతో దూకుడుమీదున్న CID.. దొరికిన ఆధారాలతో తెరవెనుక ఉన్న వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తోంది.
Read Also: సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం… ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: KTR
Follow us on: Youtube Instagram