ముందుండి నడిపించే నాయకుడు లేక,.. దిశానిర్దేశం చేసే లీడర్ లేక అయోమయంలో పడ్డారు జనసైనికులు. కీలక నేతలందరినీ వైసీపీ తన్నుకుపోయేసరికి నాయకత్వ లేమితో అంబేద్కర్ జిల్లాలో పార్టీ వెలవెలబోతోంది. కూటమి ఎఫెక్ట్‌తో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు నాయకులు కరువ య్యారు. టికెట్ రాలేదన్న కోపంతో ఆ పార్టీ కీలక నేతలంతా ప్రత్యర్థి పార్టీకి జంప్ అయ్యారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని జనసైనికులు, వీరమహిళలు దిక్కులేని పక్షుల్లా మిగిలిపోయారు. దీంతో ఇన్‌చార్జ్‌లు కావాలని హైకమాండ్‌తో మొరపెట్టుకుంటోంది క్యాడర్.
అమలాపురం జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకు టిక్కట్ ఇస్తారని ఆ పార్టీ శ్రేణులంతా ఆశపడ్డారు. కానీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత అయితాబత్తుల ఆనందరావు టిక్కట్ దక్కించుకున్నారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూసిన జనసేన ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజాబాబు కల చెదిరిపోయేసరికి పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక గత ఎన్నికల్లో తొలి స్ధానాన్ని ప్రకటించిన ముమ్మిడివరం అభ్యర్ధి పితాని బాలకృష్ణకు కూడా ఈసారి ఎన్నికల్లో చుక్కెదురైంది. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు బరిలో దిగారు. దీంతో ఆగ్రహించిన పితాని జనసేనకు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు జనసైనికులు, వీర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ గూటికి చేరారు. దీంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన ఖాళీ అయింది.
మండపేట నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ. గడచిన ఐదేళ్లు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఆయన నియోజకవర్గంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నాయకుడి కూడా అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో అలకబూనారు లీలాకృష్ణ. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు బరిలో నిలవగా.. జనసేన నుంచి పెద్దగా సహకారం లభించడం లేదని సమాచారం. ఇక రాజోలు నియోజకవర్గంలో జనసేనకు మంచి పట్టుంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్ధానం రాజోలు. అయితే, అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న బొంతు రాజేశ్వర రావు పార్టీని పటిష్టపరుస్తున్నారు. కానీ, అనూహ్యంగా ఆ స్ధానం నుంచి దేవ వరప్రసాద్‌కి టిక్కట్ ఇచ్చారు. దీంతో బొంతు రాజేశ్వరరావు కూడా వైసీపీలో చేరిపోయారు.
ఇక జిల్లాలో ఎంతో పేరున్న నియోజకవర్గం గన్నవరంలో కూడా జనసేన పార్టీకి ఇక్కట్లు తప్పడం లేదు. అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న పావుల రాజేశ్వరిని కాదని హైదరాబాద్ నుంచి గిడ్డి సత్యనారాయణను అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన స్ధానికుడే అయినా ఎక్కువ కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో ఆగ్రహించిన పాముల రాజేశ్వరి జనసేనకు గుడ్‌బై చెప్పి.. తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపుఏ కొత్తపేట నియోజవర్గంలో అన్నదమ్ముల మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ జనసేన అభ్యర్ధిగా తాను పోటీ చేయడం ఖాయమని బండారు శ్రీనివాస్ భావించారు. అయితే,.. అనుకు న్నదొక్కటి, అయింది ఒక్కటి అన్న చందంగా ఆయన అన్న తెలుగుదేశం అభ్యర్ధి బండారు సత్యానంద రావుకు టిక్కట్ దక్కింది. దీంతో శ్రీనివాస్ అధిష్టానంపై అలకబూనారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుజ్జగించినా ఆయన దిగిరాలేదు. అందుకే తన అన్నకు ఏమాత్రం సహరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా గత ఎన్నికల్లో అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన డి.ఎం.ఆర్. శేఖర్‌కు కూడా ఈసారి టిక్కట్ దక్కలేదు. దీంతో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా కూటమి దెబ్బకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పరిస్థితి అయోమయంలో పడింది. ఇన్‌చార్జ్‌లు లేకపోవడంతో ఒకవేళ ఉన్నాకూడా అంటీముట్టన్నట్టుగా వ్యవహరిస్తుండంతో జిల్లాలో జనసేన తనకు తానుగానే తుడిచిపెట్టుకుపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. మరి ఇకనైనా హైకమాండ్ వెంటనే అప్రమత్తమై.. పార్టీ శ్రేణులు కోరుతున్నట్టు ఇన్‌చార్జ్‌లు నియమిస్తుందా లేదా..? నియ మిస్తే ఎవరకి ఆ బాధ్యతలు అప్పగిస్తుంది అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


