స్వతంత్ర, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రం నుంచి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. నిన్నటి వరకు రాయుడు వైసీపీలో చేరనున్నారనే వార్తలు బలంగా వచ్చాయి. అయితే ఇప్పుడు దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రాయుడిని పోటీ చేయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందట. ఈ బాధ్యతను మాజీ క్రికెటర్, పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్‌కు అధిష్టానం అప్పగించిందట.
టీమిండియా మాజీ కెప్టెన్‌గా, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజార్‌కు అంబటితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికే రాయుడుతో అజారుద్దీన్ భేటీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రాయుడు వైపు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
1985, సెప్టెంబర్ 23న అంబటి రాయుడు గుంటూరు జిల్లా పొన్నూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. అయితే వారు జీవనోపాధి కోసం హైదరాబాద్ తరలివచ్చారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని యప్రాల్‌లో నివాసం ఉంటూ సైనిక్ పూరిలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో రాయుడిని చదివించారు. 1992వ సంవత్సరంలో హైదరాబాద్ మాజీ క్రికెటర్ విజయ్‌పాల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. దీంతో రాయుడు చిన్ననాటి నుంచి హైదరాబాద్‌లోనే ఉండడంతో అంబటిని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రాయుడు ఏపీకి చెందిన వ్యక్తి కావడంతో పాటు కాపు సామాజికవర్గానికి చెందినవాడు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో కాపు ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. అందుకే రాయుడైతే గెలుపు సులభమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో? లేదో? చూడాలి. ఒకవేళ రాయుడు తాను పుట్టిన ప్రాంతమైన ఏపీ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.