స్వతంత్ర వెబ్ డెస్క్: ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ నెల17న ప్రకటించబోయే ఐదు గ్యారంటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రజలతో పాటు వివిధ పొలిటికల్ వర్గాలూ ఇంట్రస్ట్‌గా ఎదురు చూస్తున్నాయి. ప్రజల మదిలో నిలిచిపోయేలా ఈ పథకాలను ప్రకటించాలని ఏఐసీసీ నుంచి కూడా రాష్ట్ర నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఐదు గ్యారంటీలపై పార్టీ కీలక నేతలంతా అధ్యయనం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీమ్‌ల కంటే దీటుగా ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీతో పాటు త్వరలో ప్రకటించబోయే బీసీ, మహిళా డిక్లరేషన్లను ఈ ఫైవ్ గ్యారంటీలలో పొందుపరచాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది.
మరో మూడు రోజుల్లో ఫైనల్ చేసి ఏఐసీసీకి రిపోర్టు పంపాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు అందగా, రాష్ట్ర నాయకత్వం అదే బిజీలో ఉన్నది. అయితే ఐదు గ్యారంటీలను లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని, సోనియా గాంధీ ప్రకటించే వరకు పార్టీలోనూ చర్చ జరగకూడదనే ఆదేశాలు హై కమాండ్ నుంచి ఉన్నట్లు పార్టీలోని కొందరు నేతలు తెలిపారు. ప్రాథమికంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ, 200 యూనిట్లు ఉచిత పవర్ అంశాలను గుర్తించినట్లు తెలిసింది. కానీ వీటిని పార్టీ ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు.
కర్ణాటక ఫార్ములా పరిశీలన…
కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఐదు గ్యారంటీ స్కీమ్‌లను తెలంగాణలో ప్రకటిస్తే ఎలా ఉంటుంది? పబ్లిక్‌లో ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. కర్ణాటకలో అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంట్, గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంట్లో ఒక మహిళకు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, దారిద్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యంతో పాటు అతి త్వరలో అక్కడ అమలు చేయబోయే నిరుద్యోగ భృతి స్కీమ్‌లను రాష్ట్రంలోనూ గ్యారంటీలుగా హామీ ఇవ్వడంపై పార్టీ అధ్యయనం చేస్తున్నది.
మేనిఫెస్టో పైనా కసరత్తు..
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17 ప్రకటించే ఓవరాల్ మేనిఫెస్టోపైనా స్డడీ చేస్తున్నది. వివిధ కమిటీలు అంశాల వారీగా రీసెర్చ్ చేస్తున్నాయి. డిక్లరేషన్లతో పాటు అదనంగా స్కీమ్‌లను మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు కూడా సర్వే ఆధారంగా పలు అంశాలను మేనిఫెస్టోలో పార్టీకి మేలు జరుగుతుందని సూచించినట్లు ఆయన సన్నిహిత వర్గాల్లోని ఒకరు తెలిపారు. దీంతో పార్టీ సీరియస్‌గా మేనిఫెస్టో ప్రకటనపై దృష్టి పెట్టింది.
సోనియా ప్రకటించాక రంగంలోకి…
సోనియా గాంధీ తుక్కుగూడ సభ వేదికగా ఫైవ్ గ్యారంటీలతో పాటు పార్టీ ఓవరాల్ మేనిఫెస్టోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ అంశాలను 18వ తేదీ నుంచే గడపగడపకు చేర్చాలని పార్టీ ముందస్తుగానే ప్రిపేర్ అయింది. ఈ మేరకే ఏఐసీసీ కొత్త కమిటీలు వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో పాటు సోనియా గాంధీ స్పీచ్ ప్రజలను ఆకట్టుకునేలా, సెంటిమెంట్‌తో ఉండాలని పార్టీ అంశాలను తయారు చేస్తున్నది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ స్పీచ్‌లను వేర్వేరు నేతలు తయారు చేస్తున్నారు.