స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్. ఉపాధ్యాయ నియామకాల పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తు రుసుం చెల్లింపునకు ఇవాళ్టితో గడువు ముగుస్తుంది. ఇవాళ రాత్రిలోగా ఫీజు చెల్లించిన వారికి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 1.38 లక్షల మంది ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 1.33 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. నవంబరు 20వ తేదీ నుంచి టీఆర్టీ పరీక్షలు జరగాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరోజే ఉండటం వల్ల ఈ పరీక్షను వాయిదా వేశారు. తిరిగి ఈ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. మొదట్లో దరఖాస్తుల సమర్పణకు సాంకేతిక సమస్యలు వచ్చినందున రుసుం చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరీక్ష ఆన్లైన్లో జరగనున్న విషయం తెలిసిందే.