కార్యక్రమం ఏదైనా ప్రచారం సాగాల్సిందే. అవును ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో పెళ్లి, చావులు కూడా ప్రచార వేదికగా మారిపోతున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ సాగుతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రచార పర్వంపై స్వతంత్ర ప్రత్యేక కథనం.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రచార పర్వం జోరందుకుంది. సమయం లేదు మిత్రమా అంటూ దూకుడు పెంచాయి. భానుడి భగభగను లెక్కచేయకుండా నిప్పుల వర్షం కురున్నా పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయినప్పటికీ అందరినీ కలవలేని పరిస్థితి.
పార్లమెంట్ ప్రచార ముగింపు గడువుకి సమయం ఆసన్నమైంది. ఈలోపే ఓటర్లను ప్రసన్నం చేసుకుని.. తమవైపుకి తిప్పుకోవాలన్న తపనలో ఉన్న లీడర్లు.. ఉదయం ఆరు గంటలకే క్యాంపెయిన్‌ను మొదలు పెడుతున్నారు. అయితే లోకసభ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో 2 వేలకుపైగా గ్రామాలు, 380కి పైగా గూడాలు, తాండాలు ఉండటంతో అభ్యర్థులు వీటన్నింటిని చుట్టి ఇంటింటి ప్రచారం చేయడం గగనం గా మారింది. దీనికి తోడు మాడు పగిలే ఎండులు. సూరీడు సుర్రుమనిపిస్తుంటే ఓ కాలు ముందుకు వెళ్తే, మరో కాలు రెండడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి. దీంతో ఉన్న తక్కువ టైంలోనే అందరినీ కలిసి ఓట్లు రాబట్టుకోవడం కోసం వేదిక ఏదైనా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారాన్ని సాగిస్తున్నారు పార్టీ నేతలు.
ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో జనం గుమిగూడే ప్రదేశాలపై దృష్టి సారించారు నాయకులు. ఇందుకోసం వివాహాలు, ఆధ్మాత్మిక, ఇతర శుభకార్యాలు, చావులు ఇలా దేన్నీ వదలడం లేదు. పిలుపు రాకపోయినా స్థానిక నేతల అభ్యర్థనతో హాజరవుతున్నారు. ఓ గుంపు కనిపిస్తే చాలు ఓట్ల రాజీయం నడుపుతున్నారు. ఇక పట్టణాల్లో అయితే, వాకింగ్ చేసే స్థలాల్లోకి వెళ్లి మార్నింగ్ ప్రచారాన్ని షురూ చేస్తున్నారు. అలాగే చావులను కూడా వదలడకుండా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ను పరామర్శించడంతో ఆ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చన్న ట్రిక్‌ని ఫాలో అవుతున్నారు. ఉపాధి హామీ పనులు జరిగే స్థలాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని కలిసి ఓట్ల కోసం పడరాని పాట్లుపడుతున్నారు రాజకీయ నేతలు.


