ట్విటర్ అధినేత, ప్రపంచ బిలినీయర్ ఎలన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయనకు ఆయనే సాటి. ట్విటర్ సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి మస్క్ తనదైన పంథాలో పనిచేస్తున్నారు. మొన్నటికి మొన్న ట్విటర్ లోగోను మార్చగా.. నిన్నటికి నిన్న సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించలేదని ప్రముఖుల బ్లూ టిక్ తొలగించగా.. నేడు కొన్ని మినహాయింపులతో మళ్లీ బ్లూ టిక్ ఇచ్చారు.
కనీసం 10లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్ పునరుద్ధరించారు. దీంతో తమ ఖాతాకు మళ్లీ బ్లూ టిక్ చూసి ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు. బ్లూ టిక్ కోల్పోయిన వారెవరూ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించేందుకు సుముఖత చూపించలేదు. దీనిపై పునరాలోచనలో పడిన మస్క్ ఇలా మినహాయింపులతో వారి ఖాతాలకు బ్లూటిక్ సేవలు అందించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు చెల్లించడంతోనే ప్రముఖల ట్విటర్ బ్లూ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయా? అనే దానిపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు.


