వాణిజ్య పరంగా రెండో ముంబైగా ఆదోనికి పేరు. కానీ, గతమెంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న విమ ర్శలు విన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో.. ప్రస్తుతం మౌలిక వసతులకు కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఆదోనిలో నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ప్రజలు ఏమను కుంటున్నారు ?
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం ఆదోని. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అత్యంత వెనుకపడిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థి వై. సాయిప్రసాద్ రెడ్డి. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సాయిప్రసాద్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి కృష్ణమ్మపై 24 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2009లో జరిగిన ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి మీనా క్షినాయుడు చేతిలో 256 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో దిగిన ఆయన… మీనాక్షి నాయుడుపై బంపర్ విక్టరీ కొట్టారు. పదహారు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు సాయి ప్రసాద్ రెడ్డి. అనంతరం 2019 ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి, అదే మీనాక్షి నాయుడుపై 12 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నియోజ కవర్గంపై తన పట్టు నిలుపుకున్నారు.
సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం విషయానికి వస్తే… వెనుకబడిన ప్రాంతం కావడంతో జగన్ ప్రభుత్వం ఆదోనికి వైద్య కళాశాల మంజూరు చేసింది. ఇది సాధించే విషయంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారని.. ఇదే అతి పెద్ద విజయంగా చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే..2021 మే నెలలో శంకుస్థాపన చేయగా.. ఇంకా పనులు సాగుతున్నాయి. 475 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కళాశాలలో బోధనాసుపత్రి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీతోపాటు విద్యార్థులు, ప్రొఫెసర్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. నీటి సమస్య, నిధుల సమస్యతో పనులు కాస్త నత్తన డకన సాగుతున్నాయి. మరోసారి అధికారంలోకి వస్తే ఆ మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు.
నియోజకవర్గ కేంద్రం ఆదోని సమీపంలోని ఆరేకల్లు వద్ద ఐటీఐ నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయలతో 2019లో పనులు ప్రారంభించారు. అయినా, నేటికీ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇక, బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల, వసతి గృహం కోసం 18 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే వచ్చిన కొత్తలోనే పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి. జూనియర్ కాలేజ్ ఫర్ ఉర్థూ మీడియం కోసం చేపట్టిన భవనం, సద్ భవన్ మండప్ నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. అయితే.. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్లకు అద్దెభవనంలో డిగ్రీ కాలేజీ ప్రారంభించారు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. అరకొర వసతుల మధ్య, నామ మాత్రంగానే కొన్ని కోర్సులు ప్రవేశ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది కూడా విద్యార్థుల ఒత్తిడి వల్లేనని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
వాణిజ్య పరంగా ఆదోని రెండో ముంబైగా ప్రసిద్ధి చెందింది. అలాంటి చోట ఇప్పుడు ఉపాధి అవకాశాలు కరువై పోతున్నాయి. అవును.. పత్తి పరిశ్రమలతో ఒకప్పుడు కళకళలాడింది ఈ ప్రాంతం. అయితే.. వర్షాభావ పరిస్థితులు, ఇతర అంశాలు అనుకూలించకపోవడంతో ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడులు లేవు. ఇక, ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు తగ్గించడంతో ఒక్కో పత్తి పరిశ్రమ మూతపడుతూ వచ్చింది. ఫలితంగా.. కార్మికుల పరిస్థితి దయనీ యంగా మారడంతో జీవనోపాధి కోసం వలసబాట పట్టాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది అన్న విమర్శలున్నాయి. ఆదోని పట్టణంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు సరైన వసతులు లేకుండా పోయాయి. బసాపురం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మర మ్మతులకు వచ్చింది. గతేడాది ఈ సమస్య తలెత్తడంతో ప్రస్తుతం పట్టణంలో నాలుగు రోజులకు ఓసారి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ మరమ్మతులకు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అంచనా వేయగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నీటి ఎద్దడి ఆదోని పట్టణంలో తీవ్రంగా నెలకొంది.
ఇక, జగనన్న కాలనీ పేరుతో కొత్తగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆదోనిలో 15 వందల 9 మందికి పట్టాలు మంజూరు చేశారు. అయితే… వీటిలో కేవలం 157 ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో సిద్ధం కాగా, మిగిలినవన్నీ వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక, అర్బన్ పరిధిలో పదివేల మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించగా.. అందులో ఐదు వేల ఇళ్లను 2024లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 18వందల ఇళ్లు మాత్రమే శ్లాబు స్థాయికి వచ్చాయి. మిగిలినవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. మరోవైపు.. మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంటు పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానే ఉంది. 2006లోనే మొదలైన ఈ పనులు నేటికీ కొనసాగు తూ ప్రజల సహనానికి పరీక్షగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేపట్టిన పనులు ఇంకా పెండింగ్ లో ఉండ డం, మరికొన్ని పట్టాలెక్కకపోవడంతో నియోజకవర్గ ప్రజలు.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వందకు యాబై మార్కులు వేశారు. 2019లో పూర్తికాని పనులను మరోసారి తనను గెలిపిస్తే చేస్తానంటున్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరి.. ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.


