టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో… ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి, ఖరారు చేశారు.
బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ ఇవాళ ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితా లో ఏపీకి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి బీజేపీ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశ ముంది.
ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన చర్చల్లో జనసేన, బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. నిన్న ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రెండంకెల స్థానాలు కావాలని, కనీసం పది సీట్లయినా లేకపోతే ఇబ్బందవు తుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలిసింది. తమకు ఏయే స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. 25 అసెంబ్లీ స్థానాల్ని, 10 లోక్‌సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు.. వాటిలో నుంచే 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లు కావాలని కోరారు.
సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నిర్ణయించుకున్నదానికి అదనంగా మరో అసెంబ్లీ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే టీడీపీ 94 అసెంబ్లీ, జనసేన ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్‌సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశముంది. మొత్తం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా, మూడో జాబితా కూడా ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రాలేదు.
ప్రధాని శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు మూడు పార్టీలూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్ష అని స్పష్టం
చేశాయి.


