క్షణక్షణం.. టెన్షన్ టెన్షన్.. మరుసటి నిమిషం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో అచ్చంగా జరిగింది ఇదే. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సంద ర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను వెంటాడడం. వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కలిపి ఈ చిన్న సైజు సినిమా దృశ్యాలనే తలపించాయి. అయితే, ఎట్టకేలకు ఆయనకు కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకే కాదు. పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా ఉన్న మరికొందరికీ న్యాయస్థానం లో ఊరట దక్కింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం పోలింగ్ జరిగింది. నువ్వా-నేనా అన్నట్లు ప్రచారంలో తలపడిన అధికార విపక్షాలు ప్రజలను భారీగా తరలి వచ్చి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థించాయి. ఇందుకు ప్రజల నుంచీ బాగానే స్పందన వచ్చింది. దీంతో 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా, ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాతోపాటు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి.చాలాచోట్ల భారీగా ఓటర్లు తరలి రావడంతో అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. అయితే, కొన్నిచోట్ల ఓ మోస్తరు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ కొందరు రాజకీయ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా అందరికీ ఊరట లభించింది. జూన్ ఆరు వరకు వారందర్నీ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు.
వివిధ కేసుల్లో హైకోర్టు నుంచి ఉపశమనం పొందిన వారిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ కేండిడేట్ జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. జూన్ నాలుగున అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉందని, తాము అభ్యర్థులుగా బరిలో ఉండడంతో పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉందని కోర్టుకు వీరు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా వీరు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. వివిధ రకాల షరతులతో వీరికి అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఇక, షరతుల విషయానికి వస్తే, అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు న్యాయమూర్తి. వీరి కదలికలపై నిఘా తోపాటు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్ష్యులను బెదిరించవద్దని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ పిటీషనర్లకు స్పష్టం చేశారు న్యాయమూర్తి. ప్రస్తుతానికి కేసు విషయంలో నిందితులకు ఊరట కలిగించేలా తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు న్యాయమూర్తి. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు సంబంధిత అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను జూన్ ఆరుకు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు షరతులు విధించారు హైకోర్టు న్యాయమూర్తి.
ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే, కొద్ది రోజులుగా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెంటాడుతుండడం, ఆ క్రమంలో ఆయన అటూ ఇటూ ప్లేసులు మారుస్తూ వెళ్లడం అచ్చంగా ఓ సినిమా ఛేజింగ్ వ్యవహారాన్ని గుర్తు చేసిందనే చెప్పాలి. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు వద్ద ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇది పెను దుమారం రేపింది.ఈ కేసులో రెంటచింతల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చేశారని ప్రచారం సాగింది. అప్పటికే ఆయనపై ఈసీ ఆదేశాలతో కేసు నమోదు కాగా ఖాకీలు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. దీంతో కేపీహెచ్‌బీ సమీపంలోని ఓ విల్లాలో ఆయన ఉన్నారని తెలుసుకొని అక్కడకు వెళ్లారు పోలీసులు. అయితే అదే సమయంలో ఆయన వాహనం బయటకు రావడంతో దాన్ని వెంబడించారు.
ఎమ్మెల్యే వాహనం కాస్తా పటాన్ చెరు దాటి సంగారెడ్డి వైపు వెళ్లడం మొదలు పెట్టింది. చివరకు రుద్రారం వద్ద కారును ఆపిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని చూశారు. కానీ, తీరా చూస్తే అందులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లేరు. ఆయన ఫోన్ మాత్రం కారులోనే వదిలేసి వెళ్లారని గన్‌మెన్ తోపాటు డ్రైవర్ చెప్పారు. దీంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు.ఈ వ్యవహారం మరింత ముదురుతుండడంతో అటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సైతం ఈ కేసు విషయంలో సీరియస్‌గా స్పందించారు. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా లేదంటే ఏం జరుగుందన్న ఉత్కంఠ నడుమ చివరకు ఆయన తన లాయర్ల ద్వారా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్ట్‌లో ఆయనకు ఊరట లభించింది.ప్రస్తుతానికి పిన్నెల్లి సహా మరికొందరికి జూన్ ఆరు వరకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయితే, జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి. హైకోర్టు వీరి కేసు విచారణను జూన్ ఆరున స్వీకరిస్తుంది. మరి అప్పుడు ఏం జరగబోతోంది అన్న టెన్షన్ మాత్రం ఆయా నేతలు, వారి అభిమానుల్లో మాత్రం నెలకొందనే చెప్పాలి.