ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేతలు ప్రకటనలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. బీజేపీతో టీడీపీ కూటమి ఇప్పటికే పొత్తులో ఉంది. దీంతో బీజేపీ నేతల ప్రకటనలను ఖండించలేని నిస్సహాయస్థితిలో పడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. అయితే బీజేపీ అగ్రనేతల మాటలను చంద్రబాబు ఖండించకపో వడం ముస్లిం మైనారిటీలకు మింగుడు పడటం లేదు. దీంతో పోలింగ్ నాటికి టీడీపీ శిబిరానికి పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు దూరం అవుతారన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయ.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటివరకు తమకు ఎదురేలేదని భావించిన తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా ఆత్మరక్షణలో పడింది. ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇదంతా ముస్లిం మైనారిటీలకు అమలవుతున్న రిజర్వేషన్లపై రేగిన దుమారం. అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ లకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పుపట్టారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని కుండబద్దలు కొట్టారు. ముస్లిం మైనారిటీలపై బీజేపీ విషం చిమ్మడం ఇదే తొలిసారి కాదు. ఎప్పుడు అవకాశం దొరికినా ముస్లింలను టార్గెట్ చేస్తుంటుంది కమలం పార్టీ. హిందూ ఓట్ బ్యాంక్‌ను ఆకట్టుకోవడమే ఇందులోని పరమార్థం అంటారు రాజకీయ పరిశీలకులు. కర్ణాటకలో గతంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండేవి. అయితే బస్వరాజ్ బొమ్మై నాయకత్వంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కిందటేడాది ముస్లింల రిజర్వేషన్లను ఒక్క కలం పోటుతో రద్దు చేసింది. ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికలు రెండు విడతలు జరిగాయి. ఈ రెండు విడతల్లోనూ బీజేపీకి నిరాశే ఎదురైనట్లు సంకేతాలు అందు తున్నాయి. కమలనాథుల్లో కూడా ఈ మేరకు కలవరపాటు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమాజంలో హిందూ – ముస్లిం పోలరైజేషన్ కు శ్రీకారం చుట్టింది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఇందులో భాగంగానే ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ.
వాస్తవానికి మనదేశంలో ముస్లిం సమాజం దయనీయ పరిస్థితుల్లో ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముస్లిం సమాజం బాగా వెనుకబడింది. రోడ్ల మీద పండ్లు,పల్లీలు అమ్ముకునే వాళ్లు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్లు, మోటార్ మెకానిక్కులు ఇలా రెక్కల కష్టం మీద బతికేవాళ్లలో ఎక్కువమంది ముస్లింలే కనిపిస్తారు. అంతేకాదు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు డ్రైవర్లు గానూ, వారి ఇళ్లల్లో తోటమాలీలుగానూ పనిచేసే వాళ్లలో ఎక్కువమంది ముస్లిం మైనారిటీలే ఉంటారు. ఇదిలా ఉంటే, ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2005లో ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉన్నారు. అయితే అధికార యంత్రాంగంలో ముస్లింల శాతం కేవలం 2.5 మాత్రమే. దళితులు, ఆదివాసీల కంటే దారుణ పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారని సచార్ కమిటీ తేల్చి చెప్పింది.ఒక్క మాటలో చెప్పాలంటే అనేకరంగాల్లో భారతీయ ముస్లింల వెనుకబాటుతనాన్ని జాతీయ దృష్టికి తీసుకువచ్చింది సచార్ కమిటీ. చదువు లేకపోవడమే ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. అలాగే ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో మైనారిటీల ప్రాతినిథ్యాన్ని పెంచా లని రాష్ట్ర ప్రభుత్వాలకు సచార్ కమిటీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామని కేంద్ర హెమ్ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. దీంతో నిన్న మొన్నటి వరకు దూకుడు మీదున్న టీడీపీ కూటమి ఒక్కసారిగా ఆత్మరక్షణంలో పడింది.దీనికి కారణం భారతీయ జనతా పార్టీతో టీడీపీ కూటమి పొత్తులో ఉండటమే. బీజేపీ నాయకుల ప్రకటన ఫలితంగా ముస్లిం మైనారిటీలు తమకు దూరమవుతారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేతలు తెగేసి చెప్పినా, ఆ పార్టీతో పొత్తులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపకపోవడం విడ్డూరం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నెత్తిమీద టోపీ పెట్టుకుని, తమతో ఆత్మీయ సమావేశాలంటూ సందడి చేసే చంద్రబాబు అసలు రంగు బయటపడింది ముస్లిం మైనారిటీలు మండిపడుతున్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ కుండబద్దలు కొడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. ఒకవేళ అమిత్ షా ప్రకటనను ఖండిస్తే, అది బీజేపీ అగ్రనాయకత్వానికి కంటగింపు కావచ్చు. దీంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది పసుపు పార్టీ పరిస్థితి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల జనాభా తక్కువేమీ కాదు. రాయలసీమలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు, నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో ముస్లిం మైనారిటీలున్నారు.రాయలసీమే కాదు.కోస్తా జిల్లాల్లో కూడా ముస్లిం మైనారిటీలు భారీ సంఖ్యలో ఉన్నారు. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమ , బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించడంలో ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తారు.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ తెగేసి చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఖండిం చకపోవడాన్ని ముస్లిం మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారు. తమ వర్గ ప్రయోజనాలు దెబ్బతినేలా పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రకటనలు చేస్తుంటే, చంద్రబాబు నోరు తెరవక పోవడం ముస్లిం లకు మింగుడు పడటం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల రచ్చ రోజురోజుకూ ముదురు తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఖాయంగా కనిపిస్తోందంటు న్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముస్లింవర్గాలు పోలింగ్ నాటికి యూ టర్న్ తీసుకుని, జగన్మోహన్ రెడ్డికి జై కొడతాయని టీడీపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి.