హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన లేక్ పోలీసులు.. వెంటనే ఆమెను కాపాడారు. సదరు మహిళ మెదక్ జిల్లాకు చెందిన నందినిగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకివెళ్తే.. కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాజశేఖర్ తో నందినికి మెదక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరు కలుసుకోవడం మొదలు పెట్టారు. దీంతో నందిని గర్భం దాల్చింది. నందినిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి 8 నెలల గర్భవతిని చేసి… ఇక నువ్వు నాకు వద్దు అని రాజశేఖర్ ముఖం చాటేశాడు. దీంతో కొద్దీ రోజుల క్రితం బంజారాహిల్స్ పీఎస్ లో నందిని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు రాజశేఖర్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై రాజ శేఖర్ బయటికి వచ్చాడు. ఇక తనకు న్యాయం జరుగదని భావించిన నందిని… మనస్థాపానికి లోనై ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది గమనించిన లేక్ పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.


